కేరళలో మహిళామణులకు అత్యల్ప సీట్ల కేటాయింపు
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది. గత నెల 21వ తేదీన కేరళ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీని ప్రకారం కేరళ ఓటర్లలో 1,32,20,811 మంది పురుషులు ఉంటే వాళ్లకంటే ఎక్కువగా 1,39,21,868 మంది మహిళలు ఉన్నారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ద్వారా శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఓపక్క ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ మాటలన్నీ నీటిలో ఉప్పు మూటలేనని రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా తేల్చిచెప్పాయి. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో 140 స్థానాలకుగాను అన్ని ప్రధానపార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులను నిలబెట్టారు.
మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ అత్యధికంగా 14 చోట్ల మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. సీపీఐ(ఎం) 12 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐ ఐదు చోట్ల మహిళలకు సీట్లు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తేగానీ మహిళలకు కోటాపై ఆలోచించేదిలేదని రాజకీయపార్టీల ఆలోచనగా ఉందని తాజా కేటాయింపులతో తేలిపోయింది.
అయితే విపక్ష యూడీఎఫ్ కూటమిలో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు సీట్లు ఇవ్వడం విశేషం. 1957లో కేరళ శాసనసభ ఆవిర్భవించింది. అప్పట్నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఏ ఒక్క శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కనీసం 10శాతానికి చేరుకోలేదు.
పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్నాయని ఏప్రిల్9న బరిలో దిగనున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ అన్నారు. ‘‘శక్తిసామర్థ్యాలున్న మహిళా నేతలు ఎలాంటి చట్టం, కోటా లేకుండానే సీటు సాధించి విజయతీరాలకు చేరగలరు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రతి పార్టీ.. గెలుపు గుర్రాలనే నమ్ముకుంటోంది. మహిళా అభ్యర్థి అని కాకుండా ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సీటు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి’’అని అన్నారు.
ప్రాధాన్యత పెరగాలి: ఐద్వా నాయకురాలు
‘‘ఎల్‌డీఎఫ్ కూటమి మొత్తంగా 18 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది ఏమాత్రం సరిపోదు. మాకు సీట్లు పెరగాలని ప్రతిసారీ గట్టిగా చెబుతున్నాం. పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తీరా అభ్యర్తుల తుది జాబితా బయటికొచ్చేసరికి పరిస్థితి తారుమారవుతోంది’’అని సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు, ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) జాతీయ కార్యదర్శి పీకే శ్రీమతి అసహనం వ్యక్తంచేశారు. ‘‘కేరళలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ సర్కార్ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ చట్టంపై మాట్లాడుతోంది. దమ్ముంటే తక్షణం ఆ చట్టం అమల్లోకి తేవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.


