కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 23 ఏళ్ల బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపో యినందుకు తండ్రికి క్షమాపణలు చెబుతూ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. మృతుడు ఆనంద్ కుమార్ కాన్పూర్‌లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ‘ప్రణవీర్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. 2024లో టాపర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌లో మూడో ర్యాంకును సాధించాడు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు.
తండ్రి రాజ్‌కుమార్ రిటైర్డ్ ఉద్యోగి. పెద్ద కొడుకు వివాహ సంబంధం కోసం కుటుంబమంతా బీహార్‌లోని తమ స్వగ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో గోవింద్‌నగర్‌లోని మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ ఉరివేసుకు కున్నాడు. ఉదయం వచ్చిన పనిమనిషి తలుపు తట్టినప్పటికీ అతను స్పందించకపోవడంతో ఇరుగుపొరుగుకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపుతెరిచి చూడగా యువకుడి మృతదేహం లభ్యమైంది. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను.
కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆంగ్లంలో రాసి ఉంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు అతను ‘పవర్ గ్రిడ్’లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశాడని అతని తండ్రి రాజ్‌కుమార్ తెలిపారు. రైల్వేలు, ఎస్‌ఎస్‌సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్), బ్యాంకులు, విద్యా శాఖ నిర్వహించిన నియామక పరీక్షలకు హాజరయ్యాడు. విజయం సాధించలేకపోయాడు. కొన్ని నెలలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆనంద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.


