న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మార్చిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో సకాలంలో చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులు, వాటి వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు బాధ్యతలను సక్రమంగా నిర్వహించనప్పుడు, పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత మీకు లేదు. మీకు గనుక మానవత్వం, స్పందించే గుణం ఉండి ఉంటే, మీ దగ్గర తగిన వసతులు లేనప్పుడు ఆ బిడ్డతో పాటు మీరే స్వయంగా మరో ఆస్పత్రికి వెళ్లి ఉండేవారు.
ఆమె పేదరాలు అనో, ఫీజు చెల్లించలేదనో మీరు నిర్లక్ష్యం చేశారా?’అని వైద్యులను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చిన్నారి కుటుంబానికి సహేతుకమైన మొత్తంలో పరిహారం చెల్లించాలని సంబంధిత రెండు ఆస్పత్రుల నిర్వాహకులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మార్చి 16వ తేదీన బాధిత చిన్నారిని పొరుగింట్లో ఉండే వ్యక్తి చాక్లెట్లు ఆశచూపి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి తిరిగి సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో రోజుకూలీగా పనిచేసే ఆమె తండ్రి చుట్టుపక్కల వెదికారు. నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు ఆస్పత్రుల్లోనూ ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో, చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించిన ఖాజన్ సింగ్‌మాన్వి హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్(మరియం)ఆస్పత్రులకు తగు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేందుకు ఘజియాబాద్ పోలీసులు తాత్సారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వానికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)కు, సంబంధిత ఆస్పత్రులకు, జిల్లా మేజి్రస్టేట్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల గుర్తింపుపై గోప్యత పాటించాలని పోలీసులు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాన్ని వేధించరాదంటూ పోలీసులకు స్పష్టం చేసింది.


