ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ గురు తేజ్ బహుదూర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న రోగి తీవ్రగాయాలతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో 27వ నంబర్ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. రోగి అక్బర్ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఐరన్ రాడ్ పగుళ్లిచ్చి ఫ్యాన్ పడిపోయినట్లు వార్డు సిబ్బంది తెలిపారు.
అక్బర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, ఆ కారణాలతోనే ఆయన చనిపోయారని అధికారులు అంటున్నారు. ఆయన మరణానికి ఫ్యాను పడటం కారణం కాదని చెబుతున్నారు. ఆ వార్డులో ఇతరులెవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని స్పష్టం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే అక్బర్ మరణానికి కారణమని, పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


