ర్యాలీ సక్సెస్‌ కాకపోతే దెయ్యమై వస్తా  | Sonam Wangchuk continues his indefinite hunger strike at Jantar Mantar | Sakshi
Sakshi News home page

ర్యాలీ సక్సెస్‌ కాకపోతే దెయ్యమై వస్తా 

Jul 18 2026 5:40 AM | Updated on Jul 18 2026 5:40 AM

Sonam Wangchuk continues his indefinite hunger strike at Jantar Mantar

ఈ నెల 20 దాకా ప్రాణాలతో ఉంటా..  

తేల్చిచెప్పిన సోనమ్‌ వాంగ్‌చుక్‌  

న్యూఢిల్లీ: పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే దాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నెల 20వ తేదీ వరకు ప్రాణాలతో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నెల 20న జరిగే ర్యాలీని విజయవంతం చేద్దామని అన్నారు. ఆయన ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద దీక్షా స్థలంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. 

తన శారీరక పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. ‘‘నేను పైకి బలహీనంగా కనిపించినా, అంతర్గతంగా చాలా దృఢంగా ఉన్నాను. మీరందరూ కూడా అంతర్గతంగా, బాహ్యంగానూ దృఢంగా ఉన్నారని నాకు నమ్మకం ఉంది. జూలై 20న పార్లమెంట్‌ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నాం. మనమంతా కలిసి వెళ్లి, ప్రజాస్వామ్య దేవాలయం వంటి పార్లమెంట్‌లో మన విజ్ఞాపనను సమర్పిద్దాం’’అని వాంగ్‌చుక్‌ పిలుపునిచ్చారు. ఆ రోజు ప్రజలు రాకపోయినా, ర్యాలీ విజయవంతం కాకపోయినా దెయ్యమై తిరిగివస్తానని తేల్చిచెప్పారు.  

9.5 కిలోల బరువు తగ్గిన వాంగ్‌చుక్‌  
వాంగ్‌చుక్‌ గత 24 గంటల వ్యవధిలో 350 గ్రాముల బరువు తగ్గారు. దీక్ష మొదలైనప్పటి నుంచి ఆయన బరువు 9.5 కిలోలు తగ్గిపోయింది. ఆయనలో స్వల్పంగా డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపించినప్పటికీ మానసికంగా చురుగ్గానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. దీర్ఘకాలిక నిరాహార దీక్ష కారణంగా వాంగ్‌చుక్‌ ఆరోగ్యం విషమ దశకు చేరుకుందని, దీక్ష ఇంకా కొనసాగితే అవయవాలు దెబ్బతినే ప్రమాదంతో పాటు తదుపరి దశ ఆందోళనకరంగా మారవచ్చని గురువారం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement