న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన మద్దతుగా మాట్లాడేందుకు సినిమా ప్రముఖులు జంకుతున్న వేళ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ధైర్యంగా ముందడుగు వేసింది. నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గళం విన్పించింది. నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించించింది. సోనమ్ వాంగ్‌చుక్‌తో కేంద్ర ప్రభుత్వం చర్యలు జరపాలని డిమాండ్ చేసింది. అంతేకాదు అందరి కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తుంటే జనమంతా మౌనంగా ఉండడం సమంజసం కాదని చురకలు అంటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది.
"నేను ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ రోజు మనం ఆయనను విస్మరించలేం. సోనమ్ వాంగ్‌చుక్. మనందరికీ ఆయన తెలుసు. మన దేశం కోసం ఆయన చేసిన కృషి, ఆయన సాధించిన విజయాలు, ఆయనకు లభించిన అనేక పురస్కారాల గురించి మనకు తెలుసు. ఆయనకు ఆకలిగా ఉంది. ఆయన ఏమీ తినలేదు. ఆయన ఎవరి కోసం ఇలా చేస్తున్నాడు? ప్రాణాలు కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇలా చేస్తున్నాడు. సరిగ్గా పనిచేయని ఒక వ్యవస్థతో ఆయన పోరాడుతున్నాడు. ఇది నాకు తెలుసు. ఇది మీకు తెలుసు. ఇది మనందరికీ తెలుసు. చాలా మంది ఇంకా మౌనంగానే ఉన్నారు.
విద్యార్థుల కోసం సోనమ్ వాంగ్‌చుక్ 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే అందరూ మౌనంగా ఉన్నారు. కానీ నేను మాత్రం మౌనంగా ఉండలేను. ఏమవుతుందో జరగనివ్వండి, పర్వాలేదు. నేను మాత్రం మౌనంగా ఉండలేను. ఎవరూ ఎందుకు వినడం లేదు? ఎవరికీ పట్టడం లేదు. చర్చకు ఎవరూ సిద్ధంగా లేరు. మనం మాట్లాడితే దేశ వ్యతిరేకులం అయిపోము నేను దేశ వ్యతిరేకిని కాదు. ప్రభుత్వం ఎందుకు ఆయనతో చర్చలు జరపడం లేదు. నిరాహారదీక్ష చేస్తూ ఆయన చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?'' అని సోనాక్షి సిన్హా ప్రశ్నించారు.
పలువురు ప్రముఖుల మద్దతు
సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీకి మద్దతుగా ఇప్పటికే పలువురు నటీనటులు గళం వినిపించారు. జీనత్ అమాన్, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య, అతుల్ కులకర్ణి, షాయాజీ షిండే తదితరులు వాంగ్‌చుక్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బడా నటులెవరూ వాంగ్‌చుక్‌కు మద్దతు తెలిపేందుకు ముందుకు రాలేదు.
చదవండి: సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
నీళ్లు నమిలిన వివేక్ ఒబెరాయ్
సోనాక్షి సిన్హా ధైరంగా సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు ప్రకటిస్తే నటుడు వివేక్ ఒబెరాయ్ మాత్రం నీళ్లు నమిలాడు. బీజేపీకి వ్యతిరేకంగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరసన గురించి మీరేమంటారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. "నేను ఒక నటుడిని, ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు రాజకీయ నాయకుడిని కాదు. నేను కేవలం విషయాలను గమనిస్తుంటాను అంతే అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా, పీఎం నరేంద్ర మోదీ సినిమాలో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.


