సియా గోయల్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు | Siya Goyal Father Makes Sensational Comments | Sakshi
Sakshi News home page

సియా గోయల్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Jul 17 2026 2:53 PM | Updated on Jul 17 2026 3:05 PM

Siya Goyal Father Makes Sensational Comments

పూణే: కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కేసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ.. తమ కుటుంబాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన దుకాణంపై సోదాలపై ఆయన మాట్లాడుతూ.. జూలై 14వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారని తెలిపారు.

లైసెన్స్‌కు సంబంధించిన ఈ తనిఖీలు జరిగాయని.. ఇప్పటికే తాము కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఎనిమిది నుండి పది రోజుల్లో అది వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ఆదేశించిన ప్రకారం ప్రస్తుతానికి దుకాణాన్ని మూసి ఉంచామని.. అయితే  దుకాణాన్ని సీజ్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని తాము గౌరవిస్తామన్నారు.

‘‘నా కుమార్తె చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఆమెను ఉరితీయండి.. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను న్యాయవ్యవస్థకు, చట్టానికి కట్టుబడి ఉన్నాను. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తాను. కానీ దయచేసి మమ్మల్ని శిక్షించకండి. మమ్మల్ని రోజురోజుకూ చంపేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.

కొందరు వ్యక్తులు కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని.. తప్పు చేయకపోయినా తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆయన వాపోయారు. పూణే మార్కెట్ యార్డ్‌లోని ప్రవీణ్ గోయల్‌కు చెందిన దుకాణంపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ.. జూలై 14న దాడులు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనల కింద రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేతన్ అగర్వాల్‌ హత్య కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగడ్ కోట ట్రెక్కింగ్ సమయంలో కేతన్ అగర్వాల్ మృతి చెందగా.. మొదట ప్రమాదంగా భావించారు. అయితే, సియా గోయల్, చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ ప్రకారం కేతన్‌ను కొండపై నుంచి నెట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

ట్రెక్కింగ్‌కు వెళ్లాలని సియా పదే పదే ఒత్తిడి చేయడం, బాలి పర్యటనకు ముందు కేతన్ పాస్‌పోర్ట్ అదృశ్యం కావడం.. వీరి వెంట హుడీ ధరించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ లభించడంతో ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. నిందితులిద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి పోలీస్‌ కస్టడీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement