సాక్షి, ఢిల్లీ: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్‌కు నిరసనగా జులై 20న పార్లమెంట్ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నీట్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. దీక్ష 20 రోజుకు చేరుకున్న నేపథ్యంలో వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆ నేపథ్యంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ "జూలై 20 వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. నేను బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల చాలా బలంగా ఉన్నాను. మీరంతా కూడా లోపల, బయట అంతే బలంగా ఉన్నారని నాకు తెలుసు. జూలై 20న మనం చేపట్టబోయే శాంతియుత పార్లమెంట్ మార్చ్‌కు ఈ శక్తే మనకు కావాలి. మేమంతా కలిసి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌కు వెళ్లి మా విజ్ఞప్తిని సమర్పిస్తాం."
ఈ సమయంలో ఆయన సరదాగా మాట్లాడుతూ "నేను జూలై 20 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరు రాకపోయినా, జూలై 20 మార్చ్ విజయవంతం కాకపోయినా, నేను దెయ్యంగానైనా తిరిగి వస్తాను" అని అనడంతో అక్కడ ఉన్న మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయడంపైనే ఉండాలని కోరారు.
గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ కేవలం నీటి పైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు.సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.
ఢిల్లీ హైకోర్టు జోక్యం
ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఈ నిరసనలను ప్రారంభించగా, జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.


