మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.
ప్రతిపక్ష కూటమికి షాక్?
గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతు
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్‌సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.
అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?
లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రహస్య భేటీలతో పెరిగిన చర్చ
తాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ ఆందోళన
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శరద్ పవార్ వ్యూహం ఏమిటి?
మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి.


