సీజేపీ ఆందోళ‌న‌కు యువ ఎంపీ మ‌ద్ద‌తు.. ఎవ‌రీ ప్రియా సరోజ్? | Young MP Priya Saroj joins the CJP protest at Jantar Mantar | Sakshi
Sakshi News home page

CJP ఆందోళ‌న‌కు యువ ఎంపీ మ‌ద్ద‌తు.. ఎవ‌రీ ప్రియా సరోజ్?

Jul 14 2026 7:48 PM | Updated on Jul 14 2026 8:07 PM

Young MP Priya Saroj joins the CJP protest at Jantar Mantar

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేప‌ట్టిన ఆందోళ‌న‌కు యువ ఎంపీ ప్రియా సరోజ్ మ‌ద్ద‌తు తెలిపారు. మంగ‌ళ‌వారం జంత‌ర్ మంత‌ర్‌కు వెళ్లి సంఘీభావం ప్ర‌క‌టించారు. లోక్‌స‌భ‌లో అతి వ‌య‌స్కులైన ఎంపీల్లో ఒక‌రైన ఆమె సీజేపీ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మాజ్‌వాదీ పార్టీ త‌ర‌పున మచ్లిశ‌హర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రింకు సింగ్‌తో గేత‌డాది జూన్‌లో నిశ్చితార్థం జ‌ర‌గ‌డంతో ప్రియా సరోజ్ పేరు దేశ‌మంతా తెలిసింది.

ఎవ‌రీ ప్రియా స‌రోజ్‌?
ప్రియా సరోజ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వారణాసిలో 1998లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఫోర్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్‌ 2024 సాధారణ ఎన్నికల్లో మచ్లిశహర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్‌ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

8.5 కిలోల బ‌రువు త‌గ్గిన వాంగ్‌చుక్‌
దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన మంగ‌ళ‌వారం 25వ రోజుకు చేరుకుంది. సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. ఆయన 8.5 కేజీల బ‌రువు త‌గ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్య ప‌రిస్థితి బాగా క్షీణించింద‌ని వైద్యులు తెలిపారు.

రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు 
కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనకు ప‌లువురు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా, న‌టి స్వ‌ర‌భాస్క‌ర్ మంగ‌ళ‌వారం జంత‌ర్ మంత‌ర్ చేరుకుని సోనమ్‌ వాంగ్‌చుక్‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్.. వాంగ్‌చుక్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి వాక‌బు చేశారు. బీకేయూ చారుణి ప్రెసిడెంట్ గుర్నామ్ సింగ్ చారునీ త‌దిత‌రులు కూడా సీజేపీ ధ‌ర్నాలో పాల్గొన్నారు.

చలో పార్లమెంట్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి
ఈనెల 20న త‌ల‌పెట్టిన చ‌లో పార్ల‌మెంట్‌ కార్యక్రమానికి ప్ర‌జ‌లంతా త‌ర‌లిరావాల‌ని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చింది. కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే వారు 70116 70115 నంబ‌రు మిస్డ్ కాల్ ఇవ్వాల‌ని కోరింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement