భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలోనే బియ్యం, గోధుమలు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను అందించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో ఉంది. అయితే.. ఈ వ్యవస్థలో కొన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో నకిలీ రేషన్ కార్డులు, ధాన్యం అక్రమ మళ్లింపు వంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు.. ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం స్మార్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (Smart-PDS)ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
స్మార్ట్ పీడీఎస్ గురించి
స్మార్ట్ పీడీఎస్ అనేది రేషన్ కార్డు సేవలు, ఆహార ధాన్యాల పంపిణీని పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే కొత్త వ్యవస్థ. ఈ విధానంలో లబ్ధిదారులు తమ రేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. రేషన్ ఎప్పుడు విడుదలైంది, ఏ ఫెయిర్ ప్రైస్ షాప్‌కు చేరింది, ఎప్పుడు పంపిణీ చేస్తారు? వంటి సమాచారం కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది.
ఇప్పటి వరకు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ స్మార్ట్ పీడీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం లేదా తొలగించడం, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతాయి. దీంతో ప్రజల సమయం ఆదా కావడంతో పాటు.. కార్యాలయాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు
ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు రేషన్ కార్డు నిజమైనదో.. కాదో? వెంటనే తెలుసుకోగలుగుతారు. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండటం వంటి అక్రమాలను సులభంగా గుర్తించి అరికట్టవచ్చు.
ఫేషియల్ రికగ్నిషన్
ఇప్పటి వరకు రేషన్ పంపిణీలో.. ప్రధానంగా వేలిముద్రల ఆధారంగా గుర్తింపు చేసేవారు. అయితే కొంతమంది వృద్ధులు, కూలీలు లేదా వేలిముద్రలు స్పష్టంగా లేని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. దీంతో వేలిముద్ర పనిచేయకపోయినా.. ముఖాన్ని స్కాన్ చేసి లబ్ధిదారుని గుర్తించి రేషన్ అందించవచ్చు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు రేషన్ సులభంగా అందుతుంది.
నకిలీ కార్డులు, అక్రమాలను అరికట్టడం
క్యూఆర్ కోడ్, డిజిటల్ రికార్డులు, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు వంటి సాంకేతికతల కలయికతో నకిలీ రేషన్ కార్డులను ఆరికట్టవచ్చు. డూప్లికేట్ నమోదులను తొలగించడం, సబ్సిడీ ధాన్యాలను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించకుండా నిరోధించడం వంటివి చేయవచ్చు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వ ఈ స్మార్ట్ రేషన్స్ కార్డ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో నమోదు కావడం వల్ల అధికారులు పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ వ్యవస్థను అమలు చేసే ముందు ప్రభుత్వం 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేషన్ కార్డు మేనేజ్‌మెంట్ సిస్టమ్ (RCMS) యాప్‌ను పరీక్షించి, అందులో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తిస్తుంది. అంతే కాకుండా.. ఈ యాప్ సాధారణ ప్రజలు సులభంగా ఉపయోగించగలిగే విధంగా ఉందో లేదో కూడా పరిశీలిస్తుంది.
ఇదీ చదవండి: అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!


