ఎండ‌లో వ‌డ‌దెబ్బ ఉండ‌దిక‌..! | Delhi Government Sets Up Cooling Zone Near Jama Masjid Metro To Help People Beat Summer Heat, More Details Inside | Sakshi
Sakshi News home page

Cooling Zone: రండి.. చ‌ల్ల‌బ‌డండి!

May 9 2026 5:08 PM | Updated on May 9 2026 5:29 PM

Delhi Govt set up Cooling Zone for the public amid scorching heat

న్యూఢిల్లీ: ఎండా కాలంలో మిట్ట‌మ‌ధ్యాహ్నం వేళ బ‌యట‌కు వెళ్లిన‌ప్పుడు సేద తీరేందుకు కాసింత నీడ దొరికితే చాలు అనుకుంటాం. ఎక్క‌డైనా చలివేంద్రాలు క‌న‌బ‌డితే దాహం తీర్చుకుని ఊర‌ట పొందుతాం. బ‌తుకుతెరువు కోసం, అత్య‌వ‌స‌ర ప‌నుల నిమిత్తం ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి ఎండ‌దెబ్బ త‌ప్ప‌దు. అలాంటి వారి కోసం ప్ర‌భుత్వమే శీత‌ల కేంద్రాలు ఏర్పాటు చేస్తే..?

ఢిల్లీ ప్ర‌భుత్వం అలాంటి ఏర్పాటే చేసింది. అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుంచి హ‌స్తిన పౌరుల‌కు ఊర‌ట క‌ల్పించేందుకు 'కూలింగ్ జోన్' ఏర్పాటు చేసింది. జామా మెట్రో స్టేషన్ వెలుపల దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప‌గ‌టిపూట ఎండ‌లో శ్ర‌మించే వారికి ఉప‌శ‌మం క‌ల్పించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. వేడి నుండి ఉపశమనం పొందడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఈ కూలింగ్ జోన్‌ సందర్శించవచ్చు. ఇందులో సుమారు 100 కుర్చీలు, 10 పెద్ద కూలర్లు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స సామాగ్రి ఉంటాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) సిబ్బంది ఇక్క‌డ సేవ‌లు అందిస్తారు.

హీట్ యాక్షన్ ప్లాన్ కింద ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా కూలింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలొ మ‌రిన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులో తెచ్చేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్‌ల వ‌ద్ద‌ మరిన్ని కూలింగ్ కేంద్రాల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ఏర్పాటు చేసిన శీత‌ల కేంద్రాల్లో అందిస్తున్న‌ సేవ‌లపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వీటిని వార్డు స్థాయికి విస్తరించాలని ఢిల్లీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

చ‌దవండి: ఐపీఎల్‌లో ప‌రుగుల‌ వ‌ర‌ద‌.. కార‌ణం ఇదే!

ఎండలో ప‌నిచేసే కార్మికులు, ఉద్యోగుల‌కు కూలింగ్ కేంద్రాలు ఎక్కువ‌గా ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ యాక్షన్ ఫర్ డెవలప్‌మెంట్ (IRADE) డిప్యూటీ డైరెక్టర్ రోహిత్ మగోత్రా అన్నారు. వీటిని జిల్లా స్థాయికే పరిమితం చేయ‌కుండా వార్డు స్థాయికి విస్త‌రిస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని స‌ల‌హాయిచ్చారు. అలాగే వ‌డ‌గాల్పులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో శీత‌లీక‌రణ వాహ‌నాల‌ను మొహ‌రించి ప్ర‌జ‌లకు ఉప‌శ‌మ‌నం క‌ల్పించాల‌ని కోరారు.

రోజు రోజుకు ఎండ‌లు తీవ్ర‌త‌రం అవుతున్న నేప‌థ్యంలో బహిరంగ ప్రదేశాలలో పనిచేసే కార్మికులను తీవ్రమైన వేడి, వడగాల్పుల నుంచి కాపాడ‌టానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) ఫెలో డాక్టర్ విశ్వాస్ చితాలే అన్నారు. కూల్ రూఫ్‌లు, నెట్-జీరో కూలింగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సూచించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement