నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ కుర్రాడు! | How Emerging Stars Prince Yadav And Anshul Kamboj Shine In High Intensity IPL Season, Read Fully Explained Story Inside | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరుగుతున్న యువ పేసర్‌

May 9 2026 2:27 PM | Updated on May 9 2026 4:47 PM

How Prince Yadav and Anshul Kamboj superhit in IPL explainer

ప్రిన్స్‌ యాదవ్‌ (Photo: @IPL)

భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న ఢిల్లీ బౌలర్‌

నేనున్నానంటున్న అన్షుల్‌ కంబోజ్‌!

పదును తగ్గని భువనేశ్వర్, షమీ

అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం... క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయే తత్వం... బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలయించే సత్తా ఉన్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ఓ అనామక బౌలర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు! అదేదో కోహ్లి తప్పిదం వల్ల వికెట్‌ కోల్పోయాడా అంటే ముమ్మాటికి కాదు. గుడ్‌ లెంగ్త్‌లో పడిన బంతి అనూహ్యంగా దూసుకొచ్చి కోహ్లి వికెట్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే విరాట్‌ వికెట్‌ నేలకూలింది. ‘కింగ్‌’ కోహ్లిని బోల్తా కొట్టించిన బౌలర్‌ పేరే ‘ప్రిన్స్‌’!

పట్టుమని పది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేని ఈ ఢిల్లీ కుర్రాడు... ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. బ్యాటర్ల జోరు సాగుతున్న లీగ్‌లో పేస్‌ బౌలింగ్‌ తడాఖా చూపుతున్నాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగం... ప్రతి బంతిని అనుకున్న చోట వేయగల కచ్చితత్వం... అవసరమైతే స్లో బంతులతో బురిడీ కొట్టించగల నైపుణ్యం... వెరసి 24 ఏళ్ల ప్రిన్స్‌ యాదవ్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో 16 వికెట్లు తీసిన ప్రిన్స్‌ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాడు. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ (Prince Yadav) ఐపీఎల్‌లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన ప్రిన్స్‌ 16 వికెట్లతో విజృంభించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో లక్నో జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... వారి బౌలింగ్‌ బృందంపై అందరి దృష్టి పడటం వెనక ప్రిన్స్‌ యాదవ్‌ ప్రతిభ దాగి ఉంది. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు... గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఇతర బౌలర్లు సత్తా చాటడంతో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ ఈ ఏడాది మాత్రం మొహమ్మద్‌ షమీతో కలిసి ప్రిన్స్‌ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు పడగొడుతూ... నిలకడ కనబరుస్తున్నాడు.

మొహసిన్‌ ఖాన్, మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) గాయాలతో సతమతమవుతున్న సమయంలో ప్రిన్స్‌ యాదవ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్‌’ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ప్రిన్స్‌ తన పవర్‌ చూపాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ రెండో బంతికి విరాట్‌ను అవుట్‌ చేసిన అతడు... ఆ తర్వాత మరో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. చక్కటి భాగస్వామ్యం సాగుతున్న సమయంలో పడిక్కల్‌ను రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా వెనక్కి పంపిన ప్రిన్స్‌... జితేశ్‌ శర్మను ఓ చక్కటి బంతితో బుట్టలో వేసుకొని బెంగళూరుకు పరాజయం రుచి చూపాడు.

ఈ ఒక్క మ్యాచ్‌ అనే కాకుండా... తాజా సీజన్‌లో అతడి బౌలింగ్‌ ప్రభావవంతంగా సాగింది. కోహ్లిని అవుట్‌ చేసిన అనంతరం అతడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరగగా... అంత పెద్ద స్టార్‌ వికెట్‌ తీసినప్పుడు ఆ మాత్రం ఆనందం కలగడంలో తప్పేముందనే అభిప్రాయాలే ఎక్కువ వినిపించాయి. తాజా సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ప్రిన్స్‌... ఇదే జోరు, నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో స్టార్‌గా ఎదిగే అవకాశాలున్నాయి.  

అన్షుల్‌ అదుర్స్‌ 
టీమిండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన అన్షుల్‌ కంబోజ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా వెలుగులోకి వచ్చిన అన్షుల్‌ కంబోజ్‌ను తొలుత ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసుకుంది. అక్కడ అతడికి పెద్దగా అవకాశాలు రాకపోగా... గతేడాది వేలానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ దాదాపు మూడున్నర కోట్లకు అన్షుల్‌ను సొంతం చేసుకుంది. 2025 సీజన్‌లో చెన్నై తరఫున 8 మ్యాచ్‌లాడిన కంబోజ్‌ 8 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. అయితే నిరుడు చెన్నై ప్రదర్శన నాసిరకం కావడంతో అన్షుల్‌కు కూడా ఏదీ కలిసి రాలేదు. కానీ దేశవాళీల్లో నిలకడ కొనసాగించిన అన్షుల్‌... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

బ్యాటర్ల జోరు సాగిన ఆ టెస్టు మ్యాచ్‌లో ఒక వికెట్‌ పడగొట్టిన కంబోజ్‌... అవకాశం వచ్చిన ప్రతి చోట తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ప్రధాన పేసర్లు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో... చెన్నై బౌలింగ్‌ భారాన్ని భూజలకెత్తుకున్న అన్షుల్‌ చక్కటి ప్రదర్శనతో తన విలువ పెంచుకున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 18.70 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో బ్యాటర్ల వీర విధ్వంసం సాగుతున్న సమయంలోనూ... అన్షుల్‌ ఎకానమీ రేటు కూడా 9కి లోపే (8.91) ఉండటం విశేషం. వేగం కంటే... వైవిధ్యం, కచ్చితత్వంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్న 25 ఏళ్ల అన్షుల్‌ ఇదే జోష్‌ కనబరిస్తే భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు రావడం తధ్యం!

పదును తగ్గలే! 
స్టార్‌ బౌలర్లే వికెట్లు పడగొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐపీఎల్‌లో... వెటరన్‌ బౌలర్లు తమ పదును తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. ఇటీవల ఐసీసీ టి20 వరల్డ్‌కప్ టోర్నిలో చక్కటి బౌలింగ్‌తో టీమిండియా వరసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌లో తేలిపోతుండగా... నాలుగేళ్లుగా టీమిండియా దరిదాపుల్లో కనిపించని భువనేశ్వర్‌ కుమార్‌ వరుస వికెట్లతో సత్తా చాటుతున్నాడు.

జాతీయ జట్టు తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టి20 మ్యాచ్‌లాడిన 36 ఏళ్ల భువనేశ్వర్‌ కుమార్‌... తాజా సీజన్‌లో తన స్వింగ్‌తో కట్టిపడేస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి టీమిండియా తరఫున 294 వికెట్లు తీసిన భువీ... ఐపీఎల్‌ 19వ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 17.52 సగటుతో 17 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా కేవలం 7.64 ఎకానమీతో కావడం గమనార్హం. ‘స్వింగ్‌ సుల్తాన్‌’ అనే పేరుకు న్యాయం చేస్తూ... ‘పవర్‌ ప్లే’లో వికెట్లు పడగొడుతున్న భువనేశ్వర్‌... బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన భువీ ఇంకా తనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్‌... ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఎంతో మెరుగ్గా ఉన్న భువీ... ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లాడిన తొలి పేస్‌ బౌలర్‌గానూ నిలిచాడు.

చ‌దవండి: ఐపీఎల్‌లో ప‌రుగుల‌ వ‌ర‌ద‌.. కార‌ణం ఇదే!

మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున షమీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. చాన్నాళ్లుగా భారత జట్టుకు దూరమైన షమీ... దేశవాళీల్లో నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసే తన అలవాటు ఈ సీజన్‌లోనూ కొనసాగిస్తున్న షమీ... తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటుతున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తాడనే ముద్ర పడ్డ హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తాజా ఐపీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. గతంతో పోలిస్తే ఎంతో నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్న సిరాజ్‌... పొదుపైన బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ స్టార్‌లు రబాడ, ఇషాన్‌ మలింగ, ఆర్చర్‌ సైతం వికెట్ల వేటలో ముందున్నారు. సీనియర్‌ పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్‌ గాయాలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవడంతో వారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.

–సాక్షి, క్రీడావిభాగం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement