బాదుడే పరమావధిగా బ్యాటింగ్
200 పరుగుల మార్క్ సర్వసాధారణం
ఎంత కొట్టినా ఛేదనకు సై అంటున్న జట్లు
బౌలర్లకు పీడకలలు మిగుల్చుతున్న వైనం
భారీ స్కోర్లకు కేరాప్ అడ్రస్‌గా లీగ్
ఒకప్పుడు 180 పరుగులు చేస్తే చాలు మ్యాచ్ గెలిచేసినట్లే అనే నమ్మకం ఉండేది! ఇక 200 మార్క్ దాటితే ఛేదన అసాధ్యమనిపించేది!! కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఐపీఎల్ 19వ సీజన్‌లో అయితే 220 పరుగులు చేసిన జట్లకు కూడా... విజయంపై ధీమా ఉండటం లేదు.
బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లు... అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే చిన్న బౌండరీలు... పవర్‌ప్లేలోనే బౌలర్ల భరతం పట్టే ఓపెనింగ్ జోడీలు.. మధ్య ఓవర్‌లలో పరుగుల వరద పారించే మిడిలార్డర్ బ్యాటర్లు... డెత్ ఓవర్స్‌లో బంతిని చీల్చిచెండాడే ఫినిషర్లు... అవసరమైతే అదరగొట్టే ‘ఇంపాక్ట్ ప్లేయర్లు’...
వెరసి ఎన్ని పరుగులు చేస్తే మ్యాచ్ గెలవొచ్చు అనే సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా సీజన్‌లో 41 సార్లు రెండొందలకు పైగా పరుగులు నమోదు అయ్యాయంటే బాదుడు ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా పరాజయం పాలైన జట్లు చాలా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే అరాచకానికి అర్థం మార్చింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు రికార్డు స్కోరు చేస్తే... దాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించి వారెవ్వా అనిపించింది. ఈ సీజన్‌లో సాగుతున్న పరుగుల ఊచకోతను ఓసారి పరిశీలిస్తే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 49 మ్యాచ్‌ల్లో 41 సార్లు రెండొందల పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. బౌలింగ్ చేస్తున్నది గల్లీ బౌలర్లా అన్నట్లు... బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనిపించేలా బ్యాటర్ల వీరవిహారం కొనసాగుతోంది. గతేడాది ఐపీఎల్‌లో 200పైగా లక్ష్యాన్ని 9 సార్లు ఛేదించగా... ఈ సీజన్‌లో ఇంకా లీగ్ మ్యాచ్‌లు ముగియకముందే ఈ సంఖ్య 12గా ఉంది. ఈ ఏడాది సాగుతున్న విధ్వంసకాండ చూస్తుంటే ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమే. ఒకప్పుడు భారీ స్కోరులా కనిపించిన 200 పరుగుల మార్క్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండొందల పైచిలుకు పరుగులు చేయడం పరిపాటిగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
తొలి 10 ఓవర్లే...
టి20ల్లో చేజింగ్ చేసే జట్టుకు గెలుపు సులభం అనేది జగమెరిగిన సత్యం. చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతులపై స్పష్టమైన అవగాహన ఉండటంతో చేజింగ్ జట్లు దాన్ని బట్టి ముందుకు సాగుతుంటాయి. ఈ సీజన్‌లో 12 సార్లు రెండొందలకు పైగా లక్ష్యాలను ఛేదించగా... వాటిలో 10 సార్లు సగం ఓవర్లకు ముందే లక్ష్యంలోని సగం పరుగుల కన్నా ఎక్కువ సాధించాయి. అది కూడా రెండు కంటే తక్కువ వికెట్లు మాత్రమే కోల్పోయి. దీంతో చేజింగ్ జట్లకు మంచి శుభరంభాలు దక్కాయి. సాధించాల్సిన రన్‌రేట్ పదికి లోపు ఉన్న ప్రతి సందర్భంలో చేజింగ్ జట్లు సునాయాసంగా గెలుపొందుతున్నాయి.
‘ఇంపాక్ట్’ ప్లేయర్...
సాధారణంగా క్రికెట్‌లో ఒక్కో జట్టు తరఫున 11 మంది మాత్రమే బరిలోకి దిగాల్సి ఉన్నా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనతో ఆ సంఖ్య 12కు మారింది. మైదానంలో 11 మందే ఉన్నా... ఒక అదనపు బ్యాటర్ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడే ఈ నిబంధన భారీ స్కోర్లకు కారణంగా నిలుస్తోంది. ‘బ్యాటింగ్ చేసేందుకు జట్టులో ఒక అదనపు ఆటగాడు ఉన్నాడు అని తెలిస్తే... టాపార్డర్ మరింత స్వేచ్ఛగా ఆడుతుంది’ అని కోహ్లి అన్నట్లు... ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ భారీగా పరుగులు చేయకున్నా... అతడున్నాడనే నమ్మకంతో మిగిలినవాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ నిబంధన సరిగ్గా లేదని ఇప్పటికే పలువురు దిగ్గజాలు ఆరోపించినా... నిర్వాహకులు మాత్రం దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.
చిన్న బౌండరీలు...
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మైదానాలతో పోల్చుకుంటే... మన దగ్గర బౌండరీలు చిన్నవి. అందులోనూ ఐపీఎల్‌లో అవి మరింతగా కుచించుకుపోతున్నాయి. హ్యాపీడేస్ సినిమాలో ‘టచ్ చేస్తే ఫోర్ రా’ అన్న తరహాలో బంతి బ్యాట్‌కు తాకిందే తడువు బౌండరీ వైపు పరుగులు తీస్తోంది. దీనికి వేగవంతమైన ఔట్ ఫీల్డ్ కూడా ఒక కారణమే. తాజా ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో 60 మీటర్ల కంటే తక్కువ దూరం వెళ్లిన బంతి సైతం సిక్స్‌గా మారిందంటే మన గ్రౌండ్‌లు బ్యాటర్లకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని వల్లే కొన్ని మ్యాచ్‌ల్లో ఫోర్‌ల కంటే ఎక్కువ సిక్స్‌లు నమోదవుతున్నాయి.

‘పవర్’ ప్లే
ఈ ఏడాది నమోదైన రికార్డు లక్ష్యఛేదనలను గమనిస్తే... ‘పవర్ ప్లే’ (1–6 ఓవర్లు)లో దంచికొట్టిన జట్టుదే పైచేయి అనేది స్పష్టమవుతోంది. ఫీల్డింగ్ నిబంధనలు భారీ షాట్‌లకు అనుకూలంగా ఉండే ఈ సమయంలో భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రతీ జట్టు ప్రయత్నిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్‡్ష ఆర్య తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలనే కసితో బాదేస్తుంటే... సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్‌ను డిసైడ్ చేస్తున్నారు. మిగిలిన జట్లు కూడా ఇలా పవర్‌ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ‘‘పవర్ ప్లే’లో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండటంతో... ఈ దశలోనే భారీ షాట్‌లు ఆడాలని ఓపెనర్లు నిర్ణయించుకుంటున్నారు. బంతి కాస్త అనుకూలంగా ఉన్నా... దాన్ని గీత దాటించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఐపీఎల్–2025లో పవర్ ప్లేలో ఓవర్‌కు 10.48 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టగా... ఈ ఏడాది అది 11.78గా ఉంది. అంటే పవర్‌ప్లే 12 శాతం దూకుడు పెరిగినట్లు లెక్క.

బ్యాటింగ్ పిచ్‌లు...
టెస్టు క్రికెట్ మాదిరిగా అటు బ్యాటింగ్‌కు ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించే పిచ్‌ల సంఖ్య తగ్గిపోయింది. అభిమానులను అలరించాలనే ఉద్దేశమే తప్ప... ఆటలో బ్యాలెన్స్ పాటించాలనే సోయి లేకుండా పోతోంది. దీంతో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లే దర్శనమిస్తున్నాయి. బుమ్రా, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం... పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లభించక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారంటే అందుకు తారు రోడ్‌ల లాంటి ‘ఫ్లాట్ పిచ్’లు కూడా ఒక కారణమే.
చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
ఆ మ్యాచ్ పరాకాష్ట!
తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే దూకుడుకు అర్థం మార్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో అజేయంగా 152 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అతడికి నితీశ్ రాణా సహకారం తోడవడంతో ఢిల్లీ కొండంత స్కోరు చేసింది.

తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ఆనందంగా కనిపించిన రాహుల్... ఛేదన ప్రారంభమైన ఆరు ఓవర్లలోనే నీరసించిపోయాడు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే పరమావధి అన్నట్లు పంజాబ్ ఓపెనర్లు చెలరేగిపోతుంటే... కేఎల్ రాహుల్ నిచ్చేష్టుడిలా వికెట్ల వెనక నిలబడిపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (priyansh arya) 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు చేస్తే... ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సక్స్‌లతో 76 పరుగులు చేశాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 71 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు సునాయాసంగా మ్యాచ్ గెలిచేసేంది. ఈ మ్యాచ్ గణాంకాలు పరిశీలిస్తే... ఛేదనలో పంజాబ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్‌ను లాగేసుకుంది. తొలి ఆరు ఓవర్‌లలోనే 116 పరుగులు చేసి లక్ష్యంలోని 43.8 శాతం పరుగులను ఖాతాలో వేసుకుంది. దీంతో మిగిలిన పని మరింత సులువైంది.
– సాక్షి క్రీడావిభాగం


