బాధితుల్లో ఇద్దరు భారతీయులు | Hantavirus Outbreak 2 Indians Among Crew On Cruise Ship | Sakshi
Sakshi News home page

బాధితుల్లో ఇద్దరు భారతీయులు

May 8 2026 12:36 PM | Updated on May 8 2026 4:16 PM

Hantavirus Outbreak 2 Indians Among Crew On Cruise Ship

ప్రాణాంతకంగా భావిస్తున్న హంటావైరస్  ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. క్రూయిజ్ షిప్‌లోని సిబ్బందిలో ఇద్దరు భారతీయులకు ఈ వైరస్‌ సోకింది. ముగ్గురి మరణానికి కారణమైన  వైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్న ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్-19 కంటే భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఇది మహమ్మారి  లాంటి ముప్పును కలిగించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.

బీబీసి నివేదిక ప్రకారం అర్జెంటినా నుండి బయలుదేరిన 'MV హోండియస్' (MV Hondius) అనే డచ్ విహార నౌకలో భయంకరమైన హంటా వైరస్ (Hantavirus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.  ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా  ఉండటం ఆందోళన రేపుతోంది.

ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటినాలోని ఉషువయా నుండి బయలుదేరింది. ఇది మే 10న స్పెయిన్‌లోని కానరీ దీవులకు చేరుకోవాల్సి ఉంది.  ఈ విలాసవంతమైన నౌకలో మొత్తం 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఫిలిప్పీన్స్ (38), బ్రిటన్ (31), అమెరికా (23) దేశాల వారు అధికంగా ఉన్నారు.

ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్‌ నిర్ణయం

అయితే మానుషులనుంచి మనుషులకు వ్యాపించే  హంటావైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది.ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారిలో నెదర్లాండ్స్‌కు చెందిన దంపతులతో పాటు ఒక జర్మనీ ప్రయాణికుడు ఉన్నారు. 69 ఏళ్ల డచ్ మహిళకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

మరోవైపు  వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి  నౌకలో ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు . ఈ ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ద్వీపంలో సుమారు 29 మంది ప్రయాణికులు ఈ నౌక నుండి దిగిపోయారు.  నౌకలో ఉన్న ఇద్దరు భారతీయుల ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతం మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవం

మానవుల నుండి మానవులకు వ్యాప్తి?
సాధారణంగా హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ నౌకలో గుర్తించిన 'ఆండీస్ స్ట్రెయిన్' (Andes strain) రకానికి ఒక ప్రత్యేకత    ఏంటంటే..మానవుల నుండి మానవులకు (పరిమితంగా) వ్యాపించే సామర్థ్యం ఉన్న ఏకైక రకం ఇదే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అంటువ్యాధిపై నిశితంగా నిఘా ఉంచింది.

ఊరటనిస్తున్న WHO  వివరణ 
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల నిపుణురాలు మరియా వాన్ కెర్ఖోవ్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఇది కోవిడ్ లేదా ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు. దీని వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే ముప్పు లేదని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ, ముందుజాగ్రత్తగా నౌకలో ఉన్నవారందరూ మాస్కులు ధరించాలని, రోగులకు సేవలు అందించే వారు పిపిఇ (PPE) కిట్లు వాడాలని అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement