ఇటలీలోని వెనిస్‌లో జరుగుతున్న లా బియెన్నాలే డి వెనిజియా 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అంబానీ కుటుంటం భారత జాతీయ పెవిలియన్‌ను ప్రారంభించింది. ఇది ఫ్యాషన్‌తో కూడిన భారతీయ వారసత్వ సమ్మేళనానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ మేరకు మే 7న సాయంత్రం అంబానీ కుటుంబం వెనిస్‌లో ఒక ఆత్మీయ వేడుకని నిర్వహించింది. ఆ వేడుకలో అంబానీ కుటుంబం ఆధునిక శైలులు, సాంప్రదాయ భారతీయ వైభవాన్ని సంపూర్ణంగా సమతుల్యం చేసేలా పలు రకాల లుక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో నీతా అంబానీ కుటుంబం భారతీయ కళ, ఫ్యాషన్ వైభవాన్ని ఎలా మిళితం చేసిందంటే..
గోల్డ్ శారీలో నీతా అంబానీ..
సాంస్కృతిక కార్యక్రమాల వెనుక దార్శనికురాలిగా, నీతా అంబానీ ఒక క్లాసిక్ గోల్డ్ టిష్యూ చీరలో అందానికి కేరాఫ్‌గా కనిపించారు. ఈ కార్యక్రమంలో నీతా తన కుటుంబంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నప్పుడు, ఆమె ధరించిన చీర మిరిమిట్లుగొల్పేలా కాంతిని వెదజల్లింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ విలాసానికి అంతిమ చిహ్నంగా నిలుస్తుందని ఆమె ఆహార్యం నిరూపించింది. నీతా తన లుక్‌ని ఒక భారీ వజ్రాలు-పచ్చల నెక్లెస్ సెట్, ఒక చిన్నబన్‌తో జత చేశారు.
పుదీనా రంగులో రాధికా మర్చంట్
రాధికా మర్చంట్, సున్నితమైన పుదీనా నీలం రంగులో ఉన్న ఒక అందమైన వన్-షోల్డర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసింది. ఈ గౌను నడుము వద్ద ముడుచుకుని, గ్రీకు శైలిలో క్లిష్టమైన డ్రేపింగ్‌ను కలిగి ఉంది. మెడ భాగంలో మెరుస్తున్న, స్ఫటికాకార అంచు, దానికి సరిపోయే ఆర్మ్ కఫ్, ఈ గౌనుకు ఆధునిక మెరుపును జోడించి మరింత శోభను చేకూర్చింది. రాధిక తన జుట్టును నునుపైన, ఒత్తుగా ఉన్న పోనీటెయిల్‌తో స్టైల్ చేశారు. దీంతో ఆమె ప్రకాశవంతమైన మేకప్, ప్రత్యేకమైన వజ్రాల చెవిపోగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వైన్ గౌనులో మెరిసిపోతున్న ఇషా అంబానీ
ఇషా అంబానీ అధునాతన ముదురు వైన్ రంగులో ఉన్న ఫ్లోర్-లెంగ్త్ గౌనును ధరించారు. ఈ గౌను పాశ్చాత్య ఫ్యాషన్ శైలిలో కనిపిస్తూ..సాంప్రదాయ చీర కట్టుతో మేళవించింది. గౌను పైభాగంలో ఉన్న అద్భుతమైన బంగారు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లు భుజాల మీదుగా జాలువారుతూ, ముదురు రంగు వస్త్రానికి గొప్ప కాంట్రాస్ట్‌ను అందించాయి. ఇషా తన జుట్టును మృదువైన, రొమాంటిక్ అలల రూపంలో వేసుకుని, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్, పచ్చలు పొదిగిన ఆభరణాలతో తన రూపాన్ని పూర్తిచేశారు.
ఆకర్ణణీయమైన లుక్‌లో ఆనంద్ పిరమాల్, అనంత్ అంబానీలు..
వెనిస్‌లో, అంబానీ కుటుంబం వారసత్వ సంప్రదాయాన్ని, ప్రపంచ ఫ్యాషన్‌తో మేళవించి, పవర్ డ్రెస్సింగ్‌ను పునర్నిర్వచించారు. ఆ సాయంత్రం కేవలం భారతీయ కళల వేడుకగా మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ వస్త్రధారణ నైపుణ్యానికి ఒక ప్రదర్శనగా నిలిచింది. ఇక
ఇషా అంబానీ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్, రాజసం ఉట్టిపడేలా అలంకరించిన వెండి బ్రోచ్‌తో కూడిన నల్లటి వెల్వెట్ జాకెట్‌లో ఆకర్షణీయంగా కనిపించగా, అనంత్ అంబానీ, తమ కుటుంబం మెచ్చే సూక్ష్మమైన హస్తకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అలంకారమైన లాపెల్ పిన్‌తో కూడిన నల్లటి సూట్‌లో అద్భుతంగా కనిపించారు.
(చదవండి: Met Gala 2026: రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!)


