చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.
ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.
అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


