ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవం | Mahua Moitra alleges harassment on IndiGo flight demands nofly action | Sakshi
Sakshi News home page

ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవం

May 8 2026 10:48 AM | Updated on May 8 2026 11:41 AM

Mahua Moitra alleges harassment on IndiGo flight demands nofly action

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఎంసీ ఘోరం పరాజయాన్ని ఎదుర్కొంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానంలో తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  విమానం ఎక్కేటప్పుడు కొందరు వ్యక్తులు తన వంక అసభ్యంగా చూశారని (leering), తనకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన నినాదాలు చేశారని, విమానం ల్యాండ్ అయిన తర్వాత తన అనుమతి లేకుండా వీడియోలు తీశారని, ఇదీ బీజేపీ సంప్కృతి అని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్లైట్ 6E 719లో ఏం జరిగింది?
కోల్‌కతా నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం (6E 719) లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు తనను వేధించారని మోయిత్రా ఆరోపించారు. నాలుగు నుంచి ఆరుగురు పురుషులు విమానం ఎక్కి, తన వైపు తదేకంగా చూసి, ఆ తర్వాత విమానం వెనుకకు వెళ్లారని ఆమె ఆరోపించారు. విమానం దిగిన తర్వాత వారి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, దీంతో పాటువీడియోలు తీసారని ఆరోపించారు.

ఆ వీడియోలో, ఆమె విమానంలో కూర్చుని ఉండగా, కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు  వినిపించాయి. "పిషీ చోర్ (దొంగ అత్త)", "భాయ్‌పో చోర్ (మేనల్లుడి దొంగ)" ,"తృణమూల్ వాళ్లంతా దొంగలే" వంటి నినాదాలతోపాటు, "జై శ్రీ రామ్," "జై మా దుర్గా," , "భారత్ మాతా కీ జై" అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు, మోయిత్రా విమానం ఎక్కడానికి నిశ్శబ్దంగా వేచి ఉంటూ, విమానం లోపల నిలబడి ఉండటాన్ని చూడొచ్చు.

దీనిపై మహువా స్పందిస్తూ ‘‘ఇదే బీజేపీ సంస్కృతి. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కానీ నేను దాన్ని పట్టించుకోకుండా, నేరుగా మీటింగ్‌కి వెళ్లిపోయాను. ఆ తర్వాత, సంఘీలు "వైరల్" చేస్తున్న ఒక వీడియోను కొందరు నాకు పంపారు. అప్పుడే దీనిపై  గట్టిగా ప్రశ్నించాలనుకున్నాను. దీనిపై అధికారిక ఫిర్యాదు అవసరమని @IndiGo6E నాకు తెలిపింది. అందుకేఫిర్యాదు చేశాను అంటూ ఫిర్యాదుకాపీలను కూడా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.
 

 అంతేకాదు ఈ వేధింపులను  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపై ప్రజల ఆగ్రహంగా భావించ కూడదని, ఇది స్పష్టంగా మహిళలపై జరుగుతున్న వేధింపులేనని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆమె పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపును ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు వ్యక్తులను గుర్తించి వారిని 'నో-ఫ్లై లిస్ట్' (no-fly ) లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిందితుల పేర్లను బయటపెట్టి వారిని "నేమ్ అండ్ షేమ్" (Name and Shame) చేయాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కోరారు. మహువా తన పోస్ట్‌ను మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు డీఎంకే స్టాలిన్‌తో సహా సీనియర్ రాజకీయ నాయకులను కూడా ట్యాగ్ చేశారు. ప్రజా జీవితంలో, రాజకీయ రంగాలలో మహిళల భద్రతపై విస్తృత ఆందోళనలలో భాగమే ఆ ఘటన అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఈ ఘటనపై ఇండిగో ఇంకా ఎలాంటి అధికారిక  ప్రకటన  చేయలేదు.  విమానయాన శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

 

నో-ఫ్లై లిస్ట్ అంటే 
విమాన ప్రయాణంలో సిబ్బంది పట్ల గానీ, తోటి ప్రయాణికుల పట్లగానీ ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధించినా ఫిర్యాదు చేయవచ్చు.  సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు అందినప్పుడు ఎయిర్‌లైన్స్ అంతర్గత విచారణ జరిపి, ఆ నివేదికను DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కు పంపిస్తుంది. ఇందులో వారు దోషులుగా తేలితే అలాంటి వారిని విమాన ప్రయాణాలకు అనర్హులుగా (నో-ఫ్లై లిస్ట్)లో చేర్చుతారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement