భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌కు మెసేజ్ కూడా పంపినట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్ నేతృత్వంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచినప్పటికీ, అతని ఇటీవలి బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో బీసీసీఐ లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో (2028 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని) కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది. వయసు మరియు జట్టులో యంగ్ కోర్‌ను బలోపేతం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
శ్రేయస్సే ఎందుకు..?
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ ఐపీఎల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలతోనూ సెలెక్టర్లను మెప్పించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 333 రన్స్ సాధించి 47.57 సగటు, 164.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ప్రశాంతంగా జట్టును నడిపించే విధానం శ్రేయస్ కెప్టెన్సీ కేసును బలపరిచాయి.
శ్రేయస్‌కు గతంలో భారత టెస్ట్ మరియు వన్‌డే జట్లకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అతని కామ్ అండ్ కూల్ అప్రోచ్, మెచ్యూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ భారత టీ20 జట్టుకు కావాల్సిన లక్షణాలుగా పరిగణించబడుతున్నాయి.
పేలవ ఫామ్‌లో సూర్య
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (145.52) కూడా చాలా దారుణంగా ఉంది. ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ కారణంగా సూర్య టీమిండియా కెప్టెన్సీ స్థానం ప్రమాదంలో పడింది.
కెప్టెన్సీ పోయినా జట్టులో ఉంటాడు..!
సూర్య భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయినా, సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. వాటిలో ఫామ్‌ను నిరూపించుకుంటే, తప్పక త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపిక కావచ్చు.


