కొత్త కార్డులు హుళ క్కే! | Verification Of Ration Applications Within Greater Hyderabad Limits | Sakshi
Sakshi News home page

కొత్త కార్డులు హుళ క్కే!

Jun 22 2026 12:08 PM | Updated on Jun 22 2026 12:08 PM

Verification Of Ration Applications Within Greater Hyderabad Limits

గ్రేటర్‌ పరిధిలో రేషన్‌ అర్జీలపై జరగని విచారణ

సిబ్బంది కొరత అంటున్న అధికారులు

పెరిగిపోతున్న దరఖాస్తుల పెండెన్సీ

సాక్షి, సిటీబ్యూరో: సరూర్‌ నగర్‌లోని పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసి ఏడాదికిపైగా గడిచింది. ఇప్పటివరకు కనీసం క్షేత్ర స్థాయి విచారణ జరగలేదు. సర్కిల్‌ ఆఫీస్‌కు వెళ్లి సిబ్బందిని అడిగితే  సరైన సమాధానం లేకుండా పోయింది. దీంతో ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపు లేకుండా పోయింది. ఇలా ఒక శ్రీనివాస్‌ సమస్యే కాదు.. మహా హైదరాబాద్‌లో  రేషన్‌ కార్డు మంజూరుకాని లక్షలాది మంది పేదలదీ ఇదే పరిస్థితి.

కొత్త రేషన్‌ (ఆహార భద్రత) కార్డు మంజూరు ప్రక్రియ ఆగినట్టేనా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహా నగర పరిధిలో కేవలం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ.. వాటిని పరిశీలించి కార్డుల మంజూరు మాత్రం తాత్కాలికంగా పెండింగ్‌లో వేసినట్లు  కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది అర్హులైన పేద ప్రజలు రేషన్‌ బియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ప్రతిరోజూ వందలాది కుటుంబాలు  పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో  మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల చేసుకుంటున్నాయి. దరఖాస్తులు మాత్రం లాగిన్లకు పరిమితమవుతున్నాయే తప్ప  క్షేత్రస్థాయి పరిశీలనకు మాత్రం మోక్షం లభించడం లేదు. దీంతో పెండెన్సీ పేరుకుపోతోంది.

దరఖాస్తుదారుల ప్రదక్షిణ.. 
మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పేదలు వాటి హార్డ్‌ కాపీలను పౌరసరఫరాల విభాగం సర్కిల్‌ ఆఫీసులో సమరి్పంచి ఆ తర్వాత దరఖాస్తు  స్థితి (స్టేటస్‌) తెలుసుకోవడానికి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సర్కిల్‌ ఆఫీసుల్లో సిబ్బందిని అడిగితే ‘పై నుంచి ఆదేశాలు రావాలి’.. ‘సర్వర్‌ సమస్య’ అంటూ దాటవేస్తున్నారు. మరోవైపు  పౌరసరఫరా విభాగాల్లో సర్కిల్‌ ఆఫీసుల్లో తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒకవైపు ఇతర ప్రభుత్వ విధులతో తీరికలేకుండా ఉండటం, మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో విచారణ ప్రక్రియ పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా.. గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం కార్డుల సంఖ్య సుమారు 2.41 లక్షల మించలేదు. మరోవైపు 30 శాతంపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి.  

పెరిగిన ప్రాధాన్యం..
కేవలం చౌకధరల దుకాణంలో బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా రేషన్‌ కార్డు బహుళ ప్రయోజనకారిగా పని చేస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ కింద  ఉచిత వైద్య సేవలు, గృహజ్యోతి (ఉచిత విద్యుత్‌), సబ్సిడీ సిలిండర్లు వంటి ప్రతి సంక్షేమ పథకానికి ఇది ప్రామాణికంగా మారడంతో కొత్త కార్డులకు ప్రాధాన్యం పెరిగింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement