ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతుండడంతో పాటు అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) "చలో సంసద్" ర్యాలీ దృష్ట్యా న్యూఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది.
ఆదివారం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సచిన్ శర్మ.. ఇలాంటి నిరసన ర్యాలీకి అనుమతి కోరలేదు, ఇవ్వలేదని చెప్పారు. న్యూఢిల్లీ జిల్లా అంతటా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని డీసీపీ తెలిపారు.
ఈ ఆంక్షల ప్రకారం జంతర్ మంతర్‌లో నిర్దేశించిన నిరసన స్థలం మినహా అదీ ముందస్తు అనుమతితో తప్ప, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పాల్గొనే నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధించారు. ప్రజలెవరు ర్యాలీలలో పాల్గొనొద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకరించాలని పోలీసులు కోరారు.


