వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం!  | Sonam Wangchuk had refused to end his indefinite hunger strike | Sakshi
Sakshi News home page

వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం! 

Jul 19 2026 5:36 AM | Updated on Jul 19 2026 7:25 PM

Sonam Wangchuk had refused to end his indefinite hunger strike

జంతర్‌మంతర్‌ నుంచి బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు  

వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు అడ్డంగా పెట్టి అంబులెన్స్‌లోకి 

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడి  

ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరిస్తున్న వాంగ్‌చుక్‌  

ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించిన విపక్ష నేతలు  

నిరాహార దీక్ష ప్రారంభించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే  

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చే యాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. 

ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్‌ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్‌ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. 

మరో వైపు వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్‌ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్‌ జనతా పార్టీ
(సీజేపీ) ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది.  

నాటకీయ పరిణామాలు  
వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్‌ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్‌ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు.

 ‘పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్‌ ఫోన్‌ జామర్‌ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్‌చుక్‌ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. 

పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్‌చుక్‌ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్‌చుక్‌ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్‌  
చికిత్సకు వాంగ్‌చుక్‌ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్‌ ఫ్లూయిడ్స్, ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్‌ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్‌ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్‌చుక్‌ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు.  

అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్‌  
జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. 

‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్‌ జి.డి. అగర్వాల్‌ను, హరియాణాకు చెందిన ఒలింపిక్‌ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. 

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్‌చుక్‌ను జంతర్‌ మంతర్‌ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు.  

ఖండించిన విపక్ష నేతలు  
వాంగ్‌చుక్‌ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్‌ సింగ్, మనీష్‌ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్‌ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్‌) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు.  

దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్‌ దీప్కే  
పాకిస్తాన్‌ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్‌ దీప్కే తండ్రి భగవాన్‌ దీప్కే ప్రశ్నించారు. జంతర్‌మంతర్‌ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు.  

వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి  
తన అనుమతి లేకుండా వాంగ్‌చుక్‌కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. వాంగ్‌చుక్‌ మెడికల్‌ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్‌చుక్‌ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్‌ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి నిరాకరించింది.  

అభిజిత్‌ దీప్కేపై సిరాతో దాడి  
మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్‌ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. 

ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్‌మంతర్‌ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement