breaking news
indefinite hunger strikes
-
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ చికిత్సకు వాంగ్‌చుక్ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు. అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్ వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్‌ను, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. ఖండించిన విపక్ష నేతలు వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్ దీప్కే పాకిస్తాన్ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు. వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. వాంగ్‌చుక్ మెడికల్ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నిరాకరించింది. అభిజిత్ దీప్కేపై సిరాతో దాడి మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్‌మంతర్ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
లోక్‌పాల్ కోసం అన్నా హజారే నిరశన
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి వ్యతి రేకంగా హాజారే ఏడేళ్ల కింద ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించి, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేయడం తెల్సిందే. రామ్‌లీలా మైదానంలో శుక్రవా రం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈసారి ఆయన టార్గెట్‌గా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచే అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం నిరాహార దీక్ష
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా... భోపాల్: నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్న సీఎంల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ రాజధాని భోపాల్‌లో తన సహచర మంత్రులతో కలిసి గురువారం ఆయన నాలుగు గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి మధ్యప్రదేశ్ రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తమ మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించేందుకు కూడా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తుపాను, అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికే తాము రూ.2వేల కోట్లతో ఆదుకున్నామని, ఇది ఇంతటితో ఆగబోదని మరింత సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ. 7.42 కోట్లను కూడా రైతులకు అందించామని పేర్కొన్నారు. శాశ్వత జాతీయ విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిపిన తన పర్యటనను సైతం విపక్ష కాంగ్రెస్ రాజకీయం చేసిందని విరుచుకుపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం దక్కేలా కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని సరళీకరించాలని ఈ సందర్భంగా కోరారు. -
దీక్షలు విరమించి, బంద్‌ను విజయవంతం చేయండి: వైఎస్సార్సీపీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తలు వెంటనే తమ దీక్షలు విరమించాల్సిందిగా ఆ పార్టీ ముఖ్య నేతలు సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వైఎస్సార్ సీపీ 72గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ సమన్వయ కర్తలందరూ బంద్‌ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలు విరమించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్తల స్థానంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. గురువారం నాడు న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. -
జగన్‌కు జనం అండ
సాక్షి నెట్వర్క్: జననేత జగన్మోహన్రెడ్డి దీక్షకు సంఘీభావంగా మూడురోజులకిందట సీమాంధ్ర జిల్లాల్లో 108 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, మంగళవారం తాజాగా 14మంది నిరవధిక నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2169మంది రిలేదీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా మంగళవారం 300మంది రిలేదీక్షలు చేపట్టగా, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆత్మకూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల దీక్షలు బుధవారంతో మూడోరోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లాలో 31 మంది ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా, వీరికి మద్దతుగా 152 మంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలో మాజీమంత్రి షాకీర్, వైఎస్సార్ సీపీ నేతలు జీవీ సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. విజయనగరంలో అవనాపు విజయ్‌తో సహా ఏడుగురు నేతలు చేపట్టిన నిరశన దీక్షలు మూడోరోజుకు చేరగా, మంగళవారం 96మంది రిలేదీక్షలు చేపట్టారు. తిరుపతిలో గంగమ్మకు పొంగళ్లు పెట్టి వైఎస్ జగన్‌కు ఆరోగ్యం బాగుండాలని మహిళలు మొక్కుకున్నారు. కృష్ణా జిల్లాలో పెడన మాజీఎమ్మెల్యే జోగిరమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యువనేత జక్కంపూడి రాజా, మల్కిపురంలో కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన ఆమరణ దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, శ్రీకాకుళం జిల్లాలో 100 మంది మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా దాదాపు 150 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబుతో సహా ముగ్గురు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖనగరంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగరతీరంలో జలదీక్షకు దిగారు. వెఎస్సార్ జిల్లాలో ఏడుగురి ఆమరణ దీక్షలు కొనసాగుతుండగా, మంగళవారం 208మంది రిలేదీక్షలు చేపట్టారు.


