తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తలు వెంటనే తమ దీక్షలు విరమించాల్సిందిగా ఆ పార్టీ ముఖ్య నేతలు సూచించారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తలు వెంటనే తమ దీక్షలు విరమించాల్సిందిగా ఆ పార్టీ ముఖ్య నేతలు సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వైఎస్సార్ సీపీ 72గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ సమన్వయ కర్తలందరూ బంద్‌ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలు విరమించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల స్థానంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ ముఖ్య నేతలు సూచించారు.
గురువారం నాడు న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు.