సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారన్న వైవీ.. ఆక్వా, మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు కష్టాల్లో ఉన్నారని.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్చకు ఆస్కారం కల్పించాలని కోరారు.
‘‘ఫీడ్ మాఫియా వల్ల ఆక్వా కల్చర్ రైతులకు ఫీడ్ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికే అమ్మేస్తున్నారు. వైఎస్ జగన్ సృష్టించిన ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్‌కు అమ్ముతున్నారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. పట్టణంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. దళితులపైన దాడులు, పోలీసులకు వేధింపులు పెరుగుతున్నాయి. లాకప్ డెత్‌లు పెరిగిపోతున్నాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
‘‘పోలవరం సకాలంలో పూర్తి చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. ఈ అంశాలపై చర్చలు జరగాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాము. డీలిమిటేషన్ బిల్లు చూసిన తర్వాత పార్లమెంట్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో పెరిగిపోతున్న అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. అమరావతితో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. అమరావతిలో ఒకే చోట పెట్టుబడులు పెట్టి దోపిడీ చేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోకి మావిగన్ వస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఏపీలో డీఎస్సీ కుంభకోణం: మిథున్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణానికి అన్యాయం ఏమి జరగదని కేంద్రం చెబుతోంది. ఏపీలో డీఎస్సీ కుంభకోణం జరిగింది. దీనిపై పార్లమెంటులో లేవనెత్తుతాం. రాష్ట్రంలో లాకప్ డెత్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది’’ అని తెలిపారు.


