మోదీ వీడియో.. వాంగ్‌చుక్‌ దీక్ష విరమణపై సీజేపీ స్పందన | Modi Video Message Wangchuk Fast Ends CJP Makes It Clear | Sakshi
Sakshi News home page

మోదీ వీడియో.. వాంగ్‌చుక్‌ దీక్ష విరమణపై సీజేపీ స్పందన

Jul 24 2026 6:51 AM | Updated on Jul 24 2026 7:30 AM

Modi Video Message Wangchuk Fast Ends CJP Makes It Clear

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నీట్‌ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్‌ దీక్ష ముగింపుపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) స్పందించింది. 

వాంగ్‌చుక్‌ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్‌ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్‌ పుల్‌స్టాప్‌ పెట్టారు. 

అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం
“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్‌ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్‌ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్‌ వాంగ్‌చుక్‌ అనే డీపీని అభిజిత్‌ ఇంకా ఎక్స్‌ కొనసాగిస్తుండడం గమనార్హం.

కేంద్రం ఇచ్చిన హామీలేంటి?
వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.

కాగా, జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

జూన్‌ 28 నుంచి నిరాహార దీక్ష
పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్‌ వాంగ్‌చుక్‌ జూన్‌ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్‌ మంతర్‌ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.

పేపర్‌ లీకులపై కేంద్రం కీలక చర్యలు
పరీక్ష పేపర్‌ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్‌ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్‌ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్‌ను నియమించారు. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. 

ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్‌ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.

మోదీ వీడియో మెసేజ్‌.. రాహుల్‌ కౌంటర్‌
ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అతిపెద్ద సమస్య.. పేపర్‌ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్‌ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్‌ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ప్రకటించారు. 

అలాగే సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌‌చుక్‌ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.

అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్‌ చేశారు.  దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 

మాకు రాజీనామానే కావాలి
ఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్‌ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.  “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్‌ విషయంలో మాత్రం తలొగ్గే  తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement