ధర్మేంద్ర రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదలం
కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పేపర్ లీక్ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘హాయ్.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తేలి్చచెప్పారు.
పేపర్ లీక్ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్ లీక్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు.


