విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని ఆవేదన కలిగిస్తోంది
వారి నిరసనను హింసాత్మక సంఘటనలతో ముడిపెట్టొద్దు
సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు.
విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.


