ప్లకార్డ్‌లో పంచ్‌లైన్‌... నిరసనలో రీల్‌ వైబ్‌  | Gen Z protest brings dissent to our social media feeds | Sakshi
Sakshi News home page

ప్లకార్డ్‌లో పంచ్‌లైన్‌... నిరసనలో రీల్‌ వైబ్‌ 

Jul 24 2026 6:01 AM | Updated on Jul 24 2026 6:01 AM

Gen Z protest brings dissent to our social media feeds

జెన్‌ జి సమయం

లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్‌ కానన్‌ వాడితే రెయిన్‌ డాన్స్‌ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్‌ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్‌ మారింది. సీరియస్‌ ఇష్యూ + సినిమా పంచ్‌ + సోషల్‌ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్‌ ప్రొటెస్ట్‌’.

ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ‘నీట్‌’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్‌ గ్యాస్‌ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్‌ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....

అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్‌ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్‌– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్‌1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.

మరో ప్లకార్డ్‌ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్‌– ‘నాకు ఎవరూ ఫండింగ్‌ చేయలేదు. పేపర్‌ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...
తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్‌. దానిపై మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్‌ పాత్ర. కింద కామెంట్‌– ఓయ్‌ సర్క్యూట్‌. రాంగ్‌ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్‌ స్వామీ.

మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్‌ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్‌ కానన్‌ కొట్టినా బదులుగా ‘రెయిన్‌ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.

జెన్ జి కోడెడ్‌ ప్రొటెస్ట్‌
ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్‌ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్‌ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్‌ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్‌. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్‌ కావచ్చు... జెన్‌ జికి కోపం వస్తే స్టయిల్‌ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్‌ (బాయ్‌ఫ్రెండ్‌/గర్ల్‌ఫ్రెండ్‌) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్‌ కల్చర్‌ను, మీమ్స్‌ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్‌ జి కోడెడ్‌ ప్రొటెస్ట్‌’ అంటున్నారు. బాలీవుడ్‌ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్‌.

గెట్‌ రెడీ విత్‌ మీ (G-RWM)
జెన్‌ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్‌’ నిరసన కోసం ప్రిపరేషన్‌ అంతా సోషల్‌ మీడియా రీల్స్‌ నుంచే ప్లాన్‌ అయింది. ‘గెట్‌ రెడీ విత్‌ మీ’ అంటూ రీల్స్‌ చేస్తూ యువతను సమీకరించారు. టియర్‌ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్‌ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్‌బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్‌మెంట్‌లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్‌.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్‌!’  అనే వన్‌–లైనర్‌ ఈ తరం నిరసన తత్వం. 

ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్‌ లీడర్స్‌ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్‌ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. 

వారి దారి వినూత్నం
ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్‌... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్‌ జి ప్రొటెస్ట్‌ స్టయిల్‌. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.

– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement