అభిజిత్ దీప్కేకు రాజ్ ఠాక్రే వార‌సుడి మ‌ద్ద‌తు | Amit Thackeray extend support to CJP Protest | Sakshi
Sakshi News home page

సీజేపీ పోరాటానికి అమిత్ ఠాక్రే మ‌ద్ద‌తు

Jul 18 2026 5:47 PM | Updated on Jul 18 2026 6:03 PM

Amit Thackeray extend support to CJP Protest

న్యూఢిల్లీ: విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం నిరాహారదీక్ష చేప‌ట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బ‌ల‌వంతంగా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంపై  పౌర స‌మాజం నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌ర‌దాలు అడ్డుపెట్టి ఆస్ప‌త్రికి త‌ర‌లించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పంతానికి పోకుండా దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వాంగ్‌చుక్ దీక్ష‌ను అడ్డుకున్నా ఉద్యమం ఆగ‌బోద‌ని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే ప్ర‌క‌టించారు. తాను నిరాహార‌దీక్ష చేప‌డుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సీజేపీ పోరాటానికి ప‌లు పార్టీల నాయ‌కులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు అమిత్ ఠాక్రే శ‌నివారం ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ చేరుకుని సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్ర‌క‌టించారు. నిరాహార‌దీక్ష చేప‌ట్టిన అభిజిత్ దీప్కేను క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్ ప‌ట్ల పోలీసుల వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. ఇలాంటి అణ‌చివేత‌ చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లిగిస్తాయ‌ని అన్నారు. విద్యార్థుల కోసం ప్రాణాల‌ను త్యాగం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన వ్య‌క్తి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. ప్ర‌జ‌లంతా సీజేపీ పోరాటానికి మ‌ద్ద‌తు తెలపాల‌ని ఆయ‌న కోరారు.

ప్రభుత్వం బాధ్యత వహించదా?
నీట్ అవక‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. "నీట్ పరీక్షల్లో అవకతవకల కారణంగా దేశంలో 20 మందికి పైగా యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత వహించదా? దేశంలో జవాబుదారీతనం లేదు. ఇలాంటి సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాంట్లు వ‌స్తున్నాయి. క‌చ్చితంగా ఆయ‌న రాజీనామా చేయాల్సిందేన‌ని అమిత్ ఠాక్రే అన్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మేలుకుని సీజేపీతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించారు.

చ‌ద‌వండి: ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంట‌ర్ 

రాజ్ ఠాక్రే వార‌సుడు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) వ్య‌వ‌స్థాప‌కుడు రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే. ఎమ్మెన్నెస్ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడిగా ఆయ‌న కొన‌సాగుతున్నారు. 2020లో క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల అమిత్ ఠాక్రే.. ఎమ్మెన్నెస్ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024 శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో ముంబైలోని మ‌హిం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి పరాజ‌యం పాల‌య్యారు. 2019లో మిథాలి బొరుడేను ఆయ‌న వివాహం చేసుకున్నారు. తాజాగా సీజేపీ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపి జాతీయ మీడియా దృష్టిని ఆక‌ర్షించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement