కోహిమా: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో రాష్టవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది మరణించినట్లు అక్కడి విపత్తునిర్వహాణ శాఖ ప్రకటించింది, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది.
గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైంది. ఈ విపత్తులో మోన్ టౌన్, తిజిత్ ప్రాంతాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. కొండచరియల ధాటికి పలు ఇళ్లు పూర్తిగా బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. సహాయక బృందాలు ఇప్పటివరకు శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను (ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు) వెలికితీశాయి.
కూలిపోయిన కట్టడాలు, బురద కింద మరో నలుగురు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రమాద స్థలాల నుండి రక్షించిన 12 మంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


