పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తోంది. ఖైబర్ ప్రావిన్స్‌లో మంచు చరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవ సమాధి అయ్యారు. ఘటన నుంచి ఒక్క బాలుడు మాత్రమే గాయాలతో తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.
చిత్రాల్ జిల్లా దామిల్ ప్రాంతంలోని సెరిగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుందన్నారు. ఆ ప్రాంతంలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. పెద్ద మంచు పలక దిగువకు జారుతూ వచ్చి పర్వతప్రాంతంలోని వీరున్న నివాసంపై పడిందని చెప్పారు.
మృతదేహాలను వెలికి తీశామని, ప్రాణాలతో ఉన్న 9 ఏళ్ల బాలుడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చామన్నారు. ఖైబర్‌తోపాటు బలూచిస్తాన్, బల్టిస్తాన్ పీవోకేల్లో దట్టమైన మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. ఉష్ణోగత్రులు కొన్ని చోట్ల మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. మంచు కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


