తృణమూల్ రెబెల్ ఎంపీలను ఆహ్వానించడంపై విపక్షాల మండిపాటు
సమావేశం నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష పార్టీల నేతలు
పేపర్ లీకేజీలు, విరాళాల చోరీ, ఈ20 పెట్రోల్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాజకీయ యుద్ధం మొదలైంది. ఆదివారం పార్లమెంట్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్ సహా 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పార్టీ పార్లమెంటరీ పక్ష నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ)లో టీఎంసీ రెబెల్ ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఇంకా అధికారికంగా పూర్తిస్థాయి ఆమోదం తెలపలేదని, రికార్డుల ప్రకారం తమ పార్టీ బలం ఇంకా 28గానే ఉందని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ప్రస్తావించారు. టీఎంసీ రెబల్స్‌ను అఖిలపక్ష భేటీకి పిలిచినందుకు నిరసనగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన(యూబీటీ), డీఎంకే, ఆప్, జేఎంఎం, ఆర్జేడీ సహా వామపక్ష పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్లీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు–2026(లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచే డీలిమిటేషన్ బిల్లు)పై కాంగ్రెస్ సభ్యులు ఖర్గే, ప్రమోద్ తివారీ నిరసన వ్యక్తం చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీలు, అయోధ్య రామాలయ ట్రస్టులో కోట్ల రూపాయల విరాళాల చోరీ, ఈ20 పెట్రోల్ వంటి అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌చేశారు. నియోజకవర్గాల పునరి్వభజన బిల్లుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు ఇస్తుందంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కొట్టిపారేశారు.
ఇది ప్రజాస్వామ్య హత్య
అయోధ్య రామమందిర విరాళాల చోరీ, ఇథనాల్ బ్లెండింగ్, విద్యార్థుల సమస్యలు, మణిపూర్లో కల్లోలం తదితర కీలక సమస్యలు, తాజా పరిణామాలపై వర్షాకాల సమావేశాల్లో తప్పనిసరిగా చర్చించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డీఎంకే సభ్యుడు టిఆర్ బాలు విన్నవించారు.
శివసేన(యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే సారథ్యంలోని శివసేన పార్టీలో చేరడం, వారి విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడం అన్యాయమని శివసేన(యూబీటీ) సభ్యుడు అరవింద్ సావంత్ స్పష్టంచేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు బీజేపీలో చేరడాన్ని ‘హైజాక్’గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎన్.డి.గుప్తా అభివర్ణించారు. ఇది చెల్లుతుందా లేదా అని తేల్చాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.
సభలు సజావుగా సాగేలా సహకరించండి
ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై పార్లమెంటరీ నిబంధనలను లోబడి సమగ్రమైన చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. సభలో గందరగోళం సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని విపక్షాలను కోరారు. చట్టసభల సమయం వృథా కాకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు రిజిజు చెప్పారు. గతంలో మెజార్టీ లేక ఆమోదం పొందని రాజ్యాంగ సవరణ బిల్లులపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


