విరాళాల చోరీ, పేపర్‌లీక్‌లు, పార్టీల విభజన, విదేశాంగ విధానాలపై పార్లమెంట్ వేదికగా పోరాటం
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం..హాజరైన సోనియా, ఖర్గే, రాహుల్
డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మరోమారు ప్రధానికి ఖర్గే లేఖ
బిల్లుపై అభిప్రాయాలు తెలిపేందుకు తగిన సమయం కేటాయించాలని వినతి
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వారాల క్రితం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ఐక్యమత్యంతో వీగిపోయేలా చేసిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కార్‌ను పలు సమస్యలపై ఇరుకున పెట్టేందుకు సంసిద్ధమవుతోంది. అయోధ్యలో రామమందిరం హుండీకి వచ్చిన కోట్లాది విరాళాళాలను కాజేసిన ఉదంతం మొదలు ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యావ్యవస్థ భ్రషు్టపట్టడందాకా పలు కీలక అంశాలపై ఎన్‌డీఏ సర్కార్‌ను నిలదీయనుంది.
తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ
(ఎస్పీ), శివసేన(యూబీటీ) తదితర విపక్ష పార్టీలను చీల్చే సంస్కృతిపై కేంద్రం తీరును ఎండగట్టాలనే కాంగ్రెస్ నిశ్చయినికి వచ్చింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ (సీపీపీ) భేటీలో పార్టీ అగ్రనేతలు నిర్ణయం చేశారు. ఈ నెల 20 ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్టీ వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకులు గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత, సీపీపీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10, జన్‌పథ్‌లో జరిగింది.
పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, చిదంబరం, కె.సురేష్, నసీర్ హుస్సేన్, మాణిక్యం ఠాగూర్, కుమారి సెల్జా, తారిఖ్ అన్వర్, శశి థరూర్, మనీష్ తివారీ హాజరయ్యారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన సమస్యలపై చర్చించారు.
నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, 30 రోజులపాట జైలు పాలైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు సంబంధించిన బిల్లుతో సహా పలు కీలకమైన చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని భేటీలో నేతలు నిర్ణయించారు. సీపీపీ భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖర్గే.. దేశ ప్రజల జీవితాలు, భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న అనేక అంశాలపై ప్రభుత్వాన్ని జవాబుదారిగా నిలబెడతామని తెలిపారు.
ముఖ్యంగా ఆధ్యాత్మిక విశ్వాసాలకు ద్రోహం జరిగిందన్న ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు, రాజకీయ పార్టీలను బలహీనపరిచే చర్యలు, అవినీతి ఆరోపణలు, వివిధ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ధరల పెరుగుదల, విదేశాంగ విధానంలో వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, 3.5 కోట్ల వాహన యజమానులపై 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రో ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడం, విచక్షణారహిత అడవుల నరికివేత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఖర్గే తెలిపారు.
అఖిలపక్ష సమావేశం జరపాల్సిందే..
డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సవరించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ బిల్లుపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఖర్గే పేర్కొన్నారు.
అనంతరం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేక ఏప్రిల్ 17న తిరస్కరణకు గురైందని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే బిల్లును సవరించి మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయని ఖర్గే తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన సవరించిన ప్రతిపాదనలపై అన్ని రాజకీయ పార్టీలతో ముందుగా సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు దాని వివరాలను అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు తగిన సమయం కల్పించాలని ప్రధాని మోదీకి ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.


