సమస్యలపై ఎలుగెత్తాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan gives direction to MPs at YSRCP Parliamentary Party meeting | Sakshi
Sakshi News home page

సమస్యలపై ఎలుగెత్తాలి: వైఎస్‌ జగన్‌

Jul 17 2026 5:00 AM | Updated on Jul 17 2026 5:05 AM

YS Jagan gives direction to MPs at YSRCP Parliamentary Party meeting

తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం  

రాష్ట్రంలో పరిపాలన గాలికెగిరిపోయింది.. బాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్‌లే 

డీఎస్సీ–2025 ఓ స్కామ్‌.. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు 

ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న టీచర్లకూ ‘టెట్‌’ తప్పనిసరి చేయడం సరికాదు 

రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం  

రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూములను లోకేశ్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు 

ప్రజల ఆస్తులను ప్రైవేట్‌కు పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు 

రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్‌ కాదా?  

అమరావతి నిర్మాణంలో విపరీతమైన దోపిడీ

పూలింగ్‌కు భూములివ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు 

ఇసుక, లిక్కర్, మైన్స్‌.. దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు.. ప్రతిచోటా మాఫియానే 

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది 

పీఆర్సీ, ఐఆర్‌ లేదు.. 5 డీఏలు, సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే 

రెండేళ్లలోనే ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల అప్పులు.. ప్రజలకు చేసింది మాత్రం శూన్యం 

ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, అక్రమ కేసులు  

వీటన్నింటిపై ఉభయసభల్లో గట్టిగా గళం వినిపించాలి  

సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమ­స్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్‌లో గట్టిగా మన గళం వినిపించాలి..’’ అని పార్టీ ఎంపీల­కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్సార్‌ సీపీ ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఎంపీలతో చర్చించి మార్గనిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 


డీఎస్సీ 2025 ఒక పెద్ద స్కామ్‌..
రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుంది. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడు. జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ ఉన్నారు. 

అడ్డగోలుగా భూపందేరాలు.. అంతులేని అవినీతి..
మరోవైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేశ్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది. అటు అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసు­కున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్ని­స్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవ­రి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. 

టీచర్లకు ‘టెట్‌’ ఇబ్బందులు..
టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్‌ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు ‘టెట్‌’ తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందినప్పుడు టెట్‌ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్‌ రాయమనడం భావ్యం కాదు. సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్‌ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి. వారికి సమస్యను నివేదించాలి.  

ప్రజా ఆస్తులు పప్పుబెల్లాల్లా పంపకం
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. ప్రైవేటు పేరుతో ఎక్కడికక్కడ దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని, దాదాపు పూర్తయిన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కామ్‌ ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్‌ కాదా? ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి?

అప్పుల్లో రికార్డు... ప్రతిచోట  అవినీతి, దోపిడీ..
ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, లిక్కర్, మైన్స్‌.. దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇంకా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం. మరోవైపు సిండికేట్‌ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది. భీమవరం సభ ద్వారా ఆక్వా రైతుల ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్‌ లేదు.. 5 డీఏలు పెండింగ్‌.. సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. వీటన్నింటినీ పార్లమెంట్‌ ఉభయ సభల్లో లేవనెత్తాలి. ఈ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement