హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు! | Handri Neeva tenders for TDP sympathizer | Sakshi
Sakshi News home page

హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు!

Jul 17 2026 5:04 AM | Updated on Jul 17 2026 5:04 AM

Handri Neeva tenders for TDP sympathizer

ప్రభుత్వ ఖజానాకు రూ.52.35 కోట్లు గండి 

నాలుగు ప్యాకేజీల పనులు సగటున 4.83 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు అప్పగింత 

కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకి రెండు ప్యాకేజీల్లో రూ.530.9 కోట్ల పనులు 

సీఎం చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీకి రూ.462.32 కోట్ల పనులు 

టీడీపీ సానుభూతిపరుడికి చెందిన టీఎన్‌ఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు రూ.122.09 కోట్ల పనులు 

జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలైతే ఐదు శాతం తక్కువకే పనులు జరిగేవి.. 

దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.110 కోట్లకుపైగా ఆదా అయ్యేది 

కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్న ముఖ్యనేత  

నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్నారనడానికి ఇది మరో తార్కాణం 

సాక్షి, అమరావతి:   
ప్యాకేజీ: హంద్రీ–నీవా 36ఏ (మిగిలిన పనులు పూర్తి) 
కాంట్రాక్టు విలువ: రూ.440,89,99,988  
బిడ్‌ దాఖలు చేసింది: ఎన్‌సీసీ (4.86 శాతం అధిక ధర, ఎల్‌–1), రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ (4.95 శాతం అధిక ధర, ఎల్‌–2) 
పనులు దక్కించుకుంది: ఎన్‌సీసీ (రూ.462,32,77,387.42) 
ఖజానాపై భారం, కాంట్రాక్టర్‌కు అదనపు ప్రయోజనం: రూ.21,42,77,399.42

ప్యాకేజీ: మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ 0 కిమీ నుంచి 20 కిమీ వరకూ వెడల్పు చేసే పనులు 
కాంట్రాక్టు విలువ: రూ.127,27,24,610 
బిడ్‌ దాఖలు చేసింది: ఎస్సార్‌సీ (4.83 శాతం అధిక ధర, ఎల్‌–1), బీఎస్సార్‌ (4.87 శాతం అధిక ధర, ఎల్‌–2), స్టార్‌ ప్రాజెక్ట్స్‌ (4.97 శాతం అధిక ధర, ఎల్‌–3), టీఎన్‌ఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌ (4.98 శాతం అధిక ధర, ఎల్‌–4) 
పనులు దక్కించుకుంది: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌సీ (రూ.133,41,97,208.66) 
ఖజానాపై భారం, కాంట్రాక్టర్‌కు అదనపు ప్రయోజనం: రూ.6,14,72,598.66

ప్యాకేజీ: మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ 20 కిమీ నుంచి 53.30 కిమీ వరకూ వెడల్పు చేసే పనులు 
కాంట్రాక్టు విలువ: రూ.379,17,73,403 
బిడ్‌ దాఖలు చేసింది: ఎస్సార్‌సీ(4.83 శాతం అధిక ధర, ఎల్‌–1), బీఎస్సార్‌(4.92 శాతం అధిక ధర, ఎల్‌–2), స్టార్‌ ప్రాజెక్ట్స్‌(4.99 శాతం అధిక ధర, ఎల్‌–3) 
పనులు దక్కించుకుంది: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌సీ(రూ.397,49,16,058.36) 
ఖజానాపై భారం, కాంట్రాక్టర్‌కు అదనపు ప్రయోజనం: రూ.18,31,42,655.36

ప్యాకేజీ: మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ 53.30 కిమీ నుంచి 71 కిమీ వెడల్పు చేసే పనులు 
కాంట్రాక్టు విలువ: 116,62,04,992 
బిడ్‌ దాఖలు చేసింది: టీఎన్‌ఎంఆర్‌(4.69 శాతం అధిక ధర, ఎల్‌–1), ఎస్సార్‌సీ(4.95 శాతం అధిక ధర, ఎల్‌–2) 
పనులు దక్కించుకుంది: టీఎన్‌ఎంఆర్‌(రూ.122,09,00,006.12) 
ఖజానాపై భారం, కాంట్రాక్టర్‌కు అదనపు ప్రయోజనం: రూ.5,46,95,014.12 

ఈ నాలుగు ప్యాకేజీల టెండర్లను పరిశీలిస్తే మీకు ఏమన్పిస్తుంది? కాంట్రాక్టు సంస్థలు లాలూ‘ఛీ’పడి.. పనులు పంచుకుని.. అధిక ధరలకు దక్కించుకున్నట్లు అన్పిస్తోంది కదా? మీకే కాదు ఎవరికైనా అలాగే కన్పిస్తుంది. టెండర్లలో అక్రమాలు జరిగినట్లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ వాటిని కట్టబెట్టింది. ఎందుకంటే పనులు దక్కించుకున్న మూడు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులవి మరి..  

హంద్రీ–నీవా ‘కమీషన్ల’ పథకం.. 
దుర్భిక్ష రాయలసీమకు వరదాయిని హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారనే విమర్శలకు ఇది బలం చేకూర్చుతోంది. హంద్రీ–నీవా సుజల స్రవంతి తొలి దశలో 36వ ప్యాకేజీ(పేరూరు బ్రాంచ్‌ కెనాల్, ఉరవకొండ నియోజకవర్గంలో 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్త్రిబ్యూటరీలను అభివృద్ధి చేయడం)లో మిగిలిన పనులు.. రెండో దశలో మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ను వెడల్పు చేసే పనులకు మూడు ప్యాకేజీల కింద రూ.1063.97 కాంట్రాక్టు విలువతో 18 నెలల్లోగా పూర్తి చేయాలనే నిబంధనతో గత నెల 14న జలవనరుల శాఖ వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఈ నాలుగు ప్యాకేజీల పనుల్లోనూ టీడీపీ సానుభూతిపరులకు చెందిన కాంట్రాక్టు సంస్థలే అధిక ధరలకు బిడ్‌లు దాఖలు చేశాయి. నాలుగు ప్యాకేజీ పనులను రూ.1,116.32 కోట్లకు మూడు సంస్థలు దక్కించుకున్నాయి. దీని వల్ల ఖజానాకు రూ.52.35 కోట్ల మేర గండిపడింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌సీ సంస్థ రూ.530.90 కోట్ల పనులు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీ ప్రాజెక్ట్స్‌ రూ.462.32 కోట్ల పనులు, టీడీపీ సానుభూతిపరుడికి చెందిన టీఎన్‌ఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌ రూ.122.09 కోట్ల పనులు దక్కించుకున్నాయి.  

గత ప్రభుత్వంలోనైతే రూ.110 కోట్లు ఆదా అయ్యేది.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం ఐదు శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి అంగీకరిస్తూ కాంట్రాక్టర్లు బిడ్‌లు దాఖలు చేసేవారని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహించి ఉంటే ఖజానాకు రూ.110 కోట్ల మేర ఆదా అయ్యేదని స్పష్టం చేస్తున్నారు. పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, అధిక ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, ప్రభుత్వ ధనాన్ని  దోచిపెట్టి.. వారితో కలిసి ముఖ్యనేత నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్నారనడానికి ఇది మరో తార్కాణమని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనుల టెండర్లలోనూ ఇదే రీతిలో కాంట్రాక్టర్లతో ముఖ్యనేత లాలూచీపడ్డారని ఎత్తిచూపుతున్నారు. ముఖ్యనేత దన్నుతో లైనింగ్‌ పనులు అత్యంత నాసిరకంగా చేసి ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు దోచుకున్నారని.. ఎక్కడికక్కడ లైనింగ్‌ జారిపోవడం, నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement