తాగించెయ్.. డబ్బులు లాగించెయ్..! | Government plans to increase the number of liquor shops | Sakshi
Sakshi News home page

తాగించెయ్.. డబ్బులు లాగించెయ్..!

Jul 17 2026 4:49 AM | Updated on Jul 17 2026 4:49 AM

Government plans to increase the number of liquor shops

టీడీపీ మద్యం సిండికేట్‌కు మరింత కిక్కు

మద్యం దుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వ ఆలోచన 

ప్రస్తుతం టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లో మొత్తం 3,736 మద్యం దుకాణాలు 

ఈసారి 4 వేల దుకాణాలకు అనుమతి? 

ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టే ఎత్తుగడ 

ఏటా రూ.40 వేల కోట్ల మద్యం విక్రయాలే లక్ష్యం 

ప్రస్తుత దుకాణాల లైసెన్స్‌లు రెన్యువల్‌కే నిర్ణయం! 

కొత్త నోటిఫికేషన్‌కు ఇష్టపడని ప్రభుత్వ పెద్దలు 

మళ్లీ దుకాణాలన్నీ సిండికేట్‌ చేతిలోకే!.. త్వరలో అధికారిక నిర్ణయం

సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీని టాప్‌ గేర్‌లోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందుకోసం మరిన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్‌ నిర్వహిస్తున్న మొత్తం 3,736 మద్యం దుకాణాల సంఖ్యను 4 వేలకు పెంచడానికి ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల లైసెన్స్‌ను రెండేళ్లపాటు పొడిగించడంతోపాటు కొత్త మద్యం దుకాణాలను కూడా ఏకపక్షంగా సిండికేట్‌కు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. సెపె్టంబరులో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి మొత్తం రంగం సిద్ధం చేయాలన్నది సర్కారు ఉద్దేశం. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిండికేట్‌ దోపిడీకి తెరదించి, మద్యం దుకాణాలను తగ్గించి, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పారదర్శకంగా మద్యం దుకాణాలను నిర్వహించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే మళ్లీ సిండికేట్‌కు తలుపులు బార్లా తెరిచింది. అదే ఏడాది రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులు ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు దక్కేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. వీటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఊరూవాడా మద్యం ఏరులై పారిస్తున్నారు. 

ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీ కిక్కు సరిపోవడంలేదని టీడీపీ సిండికేట్‌ భావిస్తోంది. మరిన్ని దుకాణాల కోసం పట్టుబడుతోంది. అందుకు సమ్మతించిన ప్రభుత్వ పెద్దలు దుకాణాల సంఖ్య కనీసం 10 శాతం పెంచాలని ఎక్సైజ్‌ శాఖకు  నిర్దేశించారు. దాంతో మద్యం దుకాణాల సంఖ్యను 4 వేలు దాటించడానికి ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. వీటినీ టీడీపీ సిండికేట్‌కే అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

వీటి లైసెన్సుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ, 2024లో మాదిరిగానే ఇతరులు దరఖాస్తు చేయకుండా బెదిరింపులకు గురి చేసి అడ్డుకుని, వాటిని కూడా సిండికేట్‌కే దక్కేలా చేయాలన్నది ఎత్తుగడ. గత ఏడాది రాష్ట్రంలోని 3,736 దుకాణాల ద్వారా అధికారికంగానే రూ.30 వేల కోట్ల మద్యం విక్రయించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయించి, సిండికేట్‌ జేబుల్లోకి వెళ్లిన సొమ్ము దీనికి అదనం. కొత్త దుకాణాల  ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలను రూ.40 వేల కోట్లు దాటించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుత దుకాణాల లైసెన్సులు మళ్లీ సిండికేట్‌కే..! 
ప్రస్తుత దుకాణాల రెండేళ్ల లైసెన్సు గడువు ఈ ఏడాది అక్టోబరు మొదటివారంతో ముగుస్తుంది. సెపె్టంబరులో నోటిఫి­కేషన్‌ జారీ చేసి తాజాగా లైసెన్సులు కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు అందరూ దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలి. ఈ పారదర్శక విధానానికి ప్రభుత్వ పెద్దలు అంగీకరించడంలేదు. ప్రస్తుతం ఉన్న దుకాణాలన్నింటినీ మళ్లీ తమ సిండికేట్‌ వద్దే ఉండేలా వాటి లైసెన్సులు పొడిగించాలని భావిస్తున్నారు. అందుకు ప్రతిపాదనలను రూపొందించాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. 

దరఖాస్తు ఫీజుకూ మంగళం! 
2024లో మద్యం దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు కాకుండా, కేవలం దరఖాస్తుల ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత దుకాణాల లైసెన్సులను రెన్యువల్‌ చేస్తే లైసెన్సు ఫీజు మాత్రమే వస్తుంది. దరఖాస్తు ఫీజు రాదు. పైగా, 2024లో దరఖాస్తు ఫీజు రూపంలో వచి్చన రూ.1,800 కోట్లను కూడా సర్దుబాటు చేసేందుకు ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని టీడీపీ మద్యం సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు లైసెన్సులు ఏకపక్షంగా పొడిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మద్యం దుకాణాల లైసెన్సులు, కొత్త దుకాణాలపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement