నాటకీయ పరిణామాల మధ్య పటాస్‌ శ్రీకాంత్‌ అరెస్ట్‌ | Police show Srikanth arrest in the wake of a habeas corpus petition in the High Court | Sakshi
Sakshi News home page

నాటకీయ పరిణామాల మధ్య పటాస్‌ శ్రీకాంత్‌ అరెస్ట్‌

Jul 17 2026 4:34 AM | Updated on Jul 17 2026 4:34 AM

Police show Srikanth arrest in the wake of a habeas corpus petition in the High Court

తన కుమారుడిని చూపించకపోతే పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లి రాజేశ్వరి ఆవేదన 

హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ నేపథ్యంలో.. అరెస్ట్‌ చూపించిన పోలీసులు 

రాత్రి 9.30కు న్యాయాధికారి ముందు శ్రీకాంత్‌ను హాజరుపరిచిన వైనం 

పోలీసులు తనను హింసించారని జడ్జికి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్‌ 

సొంత పూచీకత్తుపై విడుదలకు ఆదేశించిన న్యాయాధికారి 

రాప్తాడు రూరల్‌: అనంతపురం జిల్లాకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కురుబ చిట్రా శ్రీకాంత్‌ అలియాస్‌ పటాస్‌ శ్రీకాంత్‌ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. అతడి ఆచూకీపై కుటుంబసభ్యుల ఆందోళన, హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో అరెస్టు చూపించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంత్‌ను మూడురోజులుగా ప్రత్యేక పోలీసులు అదుపులో ఉంచుకుని తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.

కూటమి ప్రభుత్వాన్ని, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజును ప్రశ్నించిన కారణంగానే తన కుమారుడిని వేధిస్తున్నారని అంతకుముందు శ్రీకాంత్‌ తల్లి చిట్రా రాజేశ్వరి మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పదిరోజులుగా ఇంటికి రాలేదని, మూడురోజులుగా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసిందని పేర్కొన్నారు. తన కుమారుడిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, లేదంటే పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. 

అదే సమయంలో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేస్తున్నట్లు గురువారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి రాజేశ్వరితో సంతకాలు తీసుకున్న అనంతరం పోలీసులు శ్రీకాంత్‌ శింగనమల పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. తరువాత శ్రీకాంత్‌ను ఆస్పత్రి నుంచి అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. 

శ్రీకాంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వండి 
విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టి హింసించారని శ్రీకాంత్‌ న్యాయాధికారికి చెప్పారు. దీంతో శ్రీకాంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. తర్వాత సొంత పూచీకత్తుపై శ్రీకాంత్‌ను విడుదల చేయాలని చెప్పారు. మరోవైపు.. శ్రీకాంత్‌పై అనంతపురం వన్‌టౌన్, ఇటుకలపల్లి, శింగనమల, శ్రీసత్యసాయి జిల్లా అగళి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సెలింగ్‌ పేరుతో తీవ్రస్థాయిలో వేధించారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement