జగన్ హయాంలో విప్లవాత్మకంగా సాగిన భూముల రీసర్వే
చంద్రబాబు ఏలుబడిలో నత్తనడక
వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర రీసర్వే
అప్పట్లో 8 వేల గ్రామాల్లో పూర్తి.. 30 లక్షల మంది రైతులకు భూహక్కు పత్రాలు
ఇప్పుడు 82 శాతం గ్రామాల్లో రికార్డులు గాల్లోనే.. గడువులు దాటి ఏడునెలలు
క్రెడిట్ కొట్టేసేందుకు పథకం పేరు మార్చిన బాబు.. కొనసాగించడంలో మాత్రం చిత్తశుద్ధి శూన్యం
లక్షలాది రైతు కుటుంబాల్లో అనిశ్చితి
సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలన్నీ చేతులెత్తేసిన భూముల రీసర్వేను వైఎస్ జగన్ ప్రభుత్వం సాకారం చేసి చరిత్ర సృష్టిస్తే ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కారు నీరుగార్చేస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పేరుతో ప్రారంభమైన బృహత్తర యజ్ఞం.. డ్రోన్లు, విమానాలు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతికతతో ఐదు సెంటీమీటర్ల కచ్చితత్వంతో విజయవంతంగా జరిగింది. జగన్ హయాంలోనే దాదాపు 8 వేలగ్రామాల్లో రీసర్వే పూర్తవగా 30 లక్షలమందికి భూ యజమానులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన భూహక్కు పత్రాలు అందించారు.
లక్షల సంఖ్యలో సబ్ డివిజన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతుల డబ్బు ఆదా చేసింది. కానీ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చాక ఏడాది నిలిచిపోయి ఆ తర్వాత ప్రారంభమైన రీసర్వే ఇప్పుడు ముందుకు సాగడంలేదు. కూటమి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే చేపట్టిన 5,107 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయి రికార్డులు వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కింది కేవలం 935 గ్రామాల్లోనే. అంటే 82 శాతం గ్రామాల్లో రైతుల భూ రికార్డులు ఇంకా గాల్లోనే వేళ్లాడుతున్నాయి. ప్రతి దశలోను గడువులు దాటి నెలల తరబడి ఫైళ్లు మగ్గుతున్నాయి.
ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన కార్యదర్శుల సమీక్షలోని నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. జగన్‌కు రీ సర్వే క్రెడిట్‌ను అడ్డుకోవాలని ఆ కార్యక్రమాన్ని నిలిపివేసిన చంద్రబాబు ఆ తర్వాత జగనన్న పేరు తొలగించి ఆ పథకాన్ని తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన యంత్రాంగం, సాంకేతికత, ప్రణాళిక అన్నీ చేతిలో ఉన్నా కొనసాగించడంలో చిత్తశుద్ధి లేక రీసర్వే అట్టర్ ఫ్లాప్ షోగా మారింది.
రైతుల అష్టకష్టాలు..
రీసర్వే అస్తవ్యస్తంగా జరుగుతుండడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పాత రికార్డు చెల్లదు.. కొత్త రికార్డు రాదు. ఈ మధ్యలో ఇరుక్కున్న రైతు పరిస్థితి దయనీయంగా మారింది. భూమి తనదే అయినా రికార్డు చేతిలో లేక బ్యాంకు రుణం పుట్టడంలేదు. పంట పెట్టుబడికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సివస్తోందని నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. సర్వే జరిగి నెలలు గడుస్తున్నా తుది నోటిఫికేషన్ రాక హద్దు వివాదాలు తేలడం లేదు. జగన్ హయాంలో భూవివాదాలకు చరమగీతం పాడేందుకు మొదలైన కార్యక్రమం చంద్రబాబు నిర్లక్ష్యంతో రైతులనుఇబ్బందులు పెడుతోంది.
గడువులన్నీ గాలికి..
రీసర్వేలో ప్రతి దశకు పెట్టుకున్న గడువుల్లో ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అత్యంత కీలకమైన డ్రాఫ్ట్ రికార్డుల ఖరారు, డ్రాఫ్ట్ పాస్‌బుక్‌ల జారీ గడువు దాటి ఏడు నెలలైంది. తహసీల్దార్ పరిశీలన, జాయింట్ కలెక్టర్ ఆమోదం వంటి ప్రతి దశలోను వేలగ్రామాల ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. తుది ఆమోదం దశలో గతనెల టార్గెట్‌లో పూర్తయింది. పదిశాతం కూడా లేకపోవడం గమనార్హం. పోలవరం జిల్లాలో అయితే రీసర్వే చేపట్టిన 400కు పైగా గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా ప్రక్రియ పూర్తయి రికార్డులు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జగన్ హయాంలో ఏకకాలంలో వేలగ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడంలేదు. సర్వే నోటీసుల ఈ–కేవైసీ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఖాతాల్లో ఈ–కేవైసీ పూర్తయింది ఐదోవంతు కూడా లేదు. కొన్ని జిల్లాల్లో పదిశాతం లోపే జరిగింది. జగన్ హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థను రీసర్వేకి అనుసంధానం చేసి రైతు గడప వద్దకే సేవలు తెచ్చారు. ఇప్పుడు అదే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం సర్వే బృందాలను కుదించి రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతోంది.


