అనంతపురం అగ్రికల్చర్: కరువు రక్కసి కోరలు చాస్తోంది. వర్షాకాలంలోనూ వేసవి ఛాయలు అలముకోవడం, కరుణించడానికి వరుణుడు వెనుకాడుతుండడం వెరసి ప్రజలకు దిక్కుతోచడం లేదు. సూపర్ ఎల్–నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కదలకపోవడంతో నెలల తరబడి బెట్ట పరిస్థితులు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఫలితంగా ఆశల ఖరీఫ్ కల్లోలంగా మారుతుండటంతో అన్నదాత ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో మున్ముందు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
నెల రోజులుగా రాలని చినుకు
ఆశల నైరుతి జూన్ 6న పలకరించగా మొదట్లో మోస్తరుగా వర్షాలు పడడంతో రైతు సేద్యానికి దిగాడు. నైరుతి రాకమునుపు కూడా జూన్ మొదటి వారంలో అంతో ఇంతో వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం రాయితీ విత్తన వేరుశనగ ఇవ్వడానికి వెనుకాడినా రైతులు సొంతంగా విత్తనాలు సమకూర్చుకుని వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. జూన్ 1న 3.6 మి.మీ, 3న 5.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా... నైరుతి వచ్చాక జూన్ 7న 10.1 మి.మీ, 9న 4.9 మి.మీ, 13న 12.3 మి.మీ, 14న అత్యధికంగా 19.1 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడంతో ముంగారు పంటలు సాగు చేశారు. జూన్ 14 వరకు మంచి వర్షాలు కురిశాయి. 15 నుంచి వరుణుడు మొహం చాటేశాడు. వారం కాదు, పది రోజులు కాదు ఏకంగా నెల రోజులు పూర్తవుతున్నా చినుకులు పడటం లేదు. కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, గుమ్మఘట్ట,బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, కూడేరు, గార్లదిన్నె, అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం అర్బన్, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు తదితర 18 మండలాల్లో జూన్ 15 నుంచి జూలై 16 వరకు నెల రోజులైనా కనీసం తుంపర్లు పడకపోవడం గమనార్హం.
22 మండలాల్లో డ్రైస్పెల్స్..
ఖరీఫ్ ఆరంభంలో కీలకమైన జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలంలో 22 మండలాల్లో వరుసగా 21 రోజుల పాటు చినుకులు పడకపోవడంతో వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మరో రెండు, మూడు రోజులు గడిస్తే తాడిపత్రి, పెద్దపప్పూరు, వజ్రకరూరు, యల్లనూరు, నార్పల మండలాలు కూడా ఈ జాబితాలోకి చేరిపోతాయి. ఇంకో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే 32 మండలాలూ డ్రైస్పెల్స్ జాబితాలో ఉంటాయి. సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదయ్యాయంటే కరువు పరిస్థితులు దాపురించినట్లుగానే భావించాల్సి ఉంటుంది.
అన్నీ గాలి చినుకులే..
నాలుగైదు రోజులుగా చాలా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటలైనా వేసవిలో మాదిరి ఉక్కపోత నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. మరోపక్క 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అడపాదడపా మేఘాలు ఆవరిస్తున్నా వర్షించడం లేదు. గాలిచినుకులు మినహా కనీసం 5 మి.మీ తేలికపాటి కూడా నమోదు కావడం లేదు. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ మొదటి పక్షం రోజుల్లో కురిసిన వర్షానికి 61.2 మి.మీ గానూ 11 శాతం అధికంగా 68.8 మి.మీ నమోదైంది. జూలైలో చినుకు పడకపోవడంతో 64.3 మి.మీ గానూ ఇప్పటి వరకు కేవలం 1.3 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ 1 నుంచి జూలై 16 వరకు 95.6 మి.మీ గానూ 27.1 శాతం లోటుతో 69.7 మి.మీ వర్షం కురిసింది. పుట్లూరు, యల్లనూరు, గుత్తి, తాడిపత్రి, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో సాధారణం కన్నా 70 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
మొహం చాటేస్తున్న వరుణుడు
వర్షాకాలంలోనూ వేసవి ఛాయలు
18 మండలాల్లో నెల రోజులు పూర్తయినా రాలని చినుకు
ఆందోళనలో జిల్లా ప్రజానీకం


