● సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
● 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువ పరిశీలన
అనంతపురం న్యూటౌన్: రాయలసీమను కనుమరుగు చేయాలనుకుంటున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరించారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ‘అనంత’తో పాటు మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధనకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువను పరిశీలించనున్నట్లు చెప్పారు. హంద్రీ–నీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల జనాభాకు తాగునీరు అందాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని చంద్రబాబు 1999లో 5 టీఎంసీలకు కుదించారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఆ జీఓ రద్దు చేసి 40 టీఎంసీల సామర్థ్యంతో పనులు శరవేగంగా చేపట్టారని, దాని ఫలితంగానే 2012లో కృష్ణా జలాలు హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి వచ్చాయని వివరించారు. బాబు నిర్లక్ష్యం కారణంగానే మిగులు జలాలపై ఆధారపడాల్సిన దుస్థితి పట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,850 కోట్లతో పనులు చేశామని చెబుతున్నా అనుకున్న మేర నీళ్లు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీళ్లు తరలిస్తుండడంతో రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ హయాంలో హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టి టెండర్లు కూడా పూర్తి చేశారని, ప్రభుత్వం మారడంతో మళ్లీ చంద్రబాబు 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయన్నారు.
అప్పుడే రాయలసీమకు మేలు..
తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకువస్తేనే రాయలసీమకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే రాయలసీమలో తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. అనంతపురం, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమిస్తామని, అందరూ కలసి రావాలని కోరారు.
ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం..
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఉరవకొండ సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఆల్మట్టి, అప్పర్ భద్ర, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు ప్రమాదం ఏర్పడిందన్నారు. కేవలం కుప్పం ప్రజల మెప్పు కోసమే చంద్రబాబు హంద్రీ–నీవా పనులను కొనసాగిస్తున్నారని చెప్పారు. చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువను పరి శీలించి ఆ ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు.


