చీకటి పడగానే కొల్లగొట్టుడే | - | Sakshi
Sakshi News home page

చీకటి పడగానే కొల్లగొట్టుడే

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

యథేచ్ఛగా బీటీపీ కాలువ మట్టి

అక్రమ రవాణా

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు

కళ్యాణదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్ట్‌ (బీటీపీ) కాలువ పనుల్లో భాగంగా పలు చోట్ల తవ్విన మట్టి అక్రమంగా తరలిపోతోంది. కొంతమంది స్వార్థపరులు చీకటి పడగానే గుట్టుచప్పుడు కాకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. రాత్రయిందంటే చాలు బీటీపీ కాలువ సమీపంలో టిప్పర్ల హడావుడి మొదలవుతోంది. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు, నారాయణపురం, ఉప్పొంక వద్ద జరుగుతున్న కాలువ పనుల్లో మట్టి అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీ పనుల కోసమే మట్టిని వినియోగిస్తున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా మట్టిని కొల్లగొడుతున్నా పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా.. లేక వారి వెనుక ఉన్న టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రకృతి సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలించిన మట్టికి తిరిగి కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తవ్విన మట్టి ఎక్కడికి తరలించారో కూడా గుర్తించాలి.

– గోపారం శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement