రాప్తాడు రూరల్: వర్షాభావంలో రైతులు తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. సాలురెడ్డి సూచించారు. గురువారం మండలంలోని అయ్యవారిపల్లిలో పర్యటించి వర్షాధారిత వేరుశనగ, కంది పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన పంట సంరక్షణ చర్యలపై వారికి సూచనలు చేశారు. కంది పంటలో తల్లి సాలు పక్కనే మడక సాలు దున్నడం వల్ల వర్షం కురిసినప్పుడు నీరు భూమిలోకి బాగా ఇంకి, ఎక్కువ రోజులు పంటకు తేమ అందుబాటులో ఉండి నీటి ఎద్దడి ప్రభావం తగ్గుతుందని రైతులకు వివరించారు. అలాగే పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. పంటలు సాగు చేసిన ప్రతి రైతు సంబంధిత బ్యాంకుల్లో పంటల బీమా చేయించుకోవాలని, పంట రుణం లేని రైతులు సీఎస్‌సీ కేంద్రాల ద్వారా బీమా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ–పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–పంట నమో దు చేయించుకుని, ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. ఆయన వెంట అనంతపురం ఏడీఏ ఏ. వెంకట్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి ఎస్. కృష్ణచైతన్య, ఏఈఓలు సుజిత, రంజిత, ఆర్‌ఎస్‌కే సిబ్బంది లక్ష్మి, సోనియా, భార్గవ్, రైతులు ఉన్నారు.


