ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగనామం
యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు
కానీ 64.76 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం
తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం
రెండో ఏడాది 21 లక్షల మంది తల్లులకు మొండిచేయి
ఈ పథకానికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు కేటాయించాలి
కానీ ఈ ఏడాది రూ.10,120.78 కోట్లకే అనుమతి
గత ఏడాది అరకొరగా రూ. 6,377 కోట్ల విదిలింపు
మూడేళ్లలో తల్లులకు బాబు బకాయి రూ.22,840.68 కోట్లు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ‘‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు... ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు’’ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల సాకులతో తల్లికి వందనం పథకాన్ని మమ అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురుచూస్తున్న తల్లులకు నిరాశనే మిగిల్చారు.
రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గురువారం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. మొత్తం 64.76 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రకటించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా.. అందులో పాఠశాలల నిర్వహణ పేరుతో రూ.2 వేలను మినహాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.
తల్లులకు చంద్రబాబు బకాయి రూ.22,840.68 కోట్లు..
యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్‌యూడైస్ (యూడీఐఎస్‌ఈ) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67.27 లక్షల మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ..66 లక్షల మందికి రూ. 6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే, ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించారు.
తమ ఖాతాలలో అరకొరగా నగదు జమ అయ్యిందని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు. మూడేళ్లలో తల్లులకు రూ. 39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది..రూ. 6,377 కోట్లు, ఈ ఏడాది జమ చేస్తారని చెబుతున్నది రూ. 10,120.78 కోట్లు..అంటే తల్లులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి రూ. 22,840.68 కోట్లన్నమాట. ఈ ఏడాదైనా నగదు పూర్తిగా జమ చేస్తారా లేక గత ఏడాది మాదిరిగా తల్లుల ఖాతాలలో అరకొరగా వేస్తారా అనేది చూడాల్సి ఉంది.
అర్హతల పేరుతో కఠిన నిబంధనలు
⇒ గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండాలి.
⇒ కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరి.
⇒ 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమికి మించి ఉండకూడదు.
⇒ ట్రాక్టర్, ఆటో మినహా నాలుగు చక్రాల వాహనం ఉంటే అర్హత ఉండదు.
⇒ నెలకు 300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం ఉండకూడదు.
⇒ 1,000 చదరపు అడుగులకు మించిన మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.
⇒ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్ లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి ఉంటే పథకం వర్తించదు.
⇒ ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ వంటి కోర్సుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
⇒ అనాథలు, వీధి పిల్లలకు ప్రత్యేక నిబంధనలు..
⇒ కొత్తగా మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆగస్టు 25 వరకు జాబితాలో చేర్చనున్నారు.
నిధుల విడుదల షెడ్యూల్ ఇలా
జూలై 22: తొలి విడత నిధుల విడుదల, అర్హులు,అనర్హుల జాబితాల ప్రదర్శన.
ఆగస్టు 3 వరకు: ఫిర్యాదుల స్వీకరణ.
ఆగస్టు 30: అదనపు అర్హుల జాబితా విడుదల, నిధుల చెల్లింపు.
జగన్ మానసపుత్రిక
గత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో పేదల అవస్థలను కళ్లారా చూసి, పిల్లల చదువులు భరోసా ఇవ్వాలని సంకల్పించారు. అధికారంలోకి రాగానే ‘అమ్మ ఒడి’ పేరుతో మానసపుత్రికగా సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి తల్లికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. అదే పథకానికి తల్లికి వందనం అంటూ పేరు మార్చేసి పథకాన్ని తామే కొత్తగా ప్రారంభించినట్లు చంద్రబాబు, లోకేశ్ ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పూర్తి నగదు ఇస్తామని ఇదే లోకేశ్ ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకుని మరీ ప్రకటించారు. మరి ఇప్పుడు అదేమయ్యిందో ఆయనకే తెలియాలి. సీఎం చంద్రబాబు సైతం అమ్మ ఒడి పథకానికి కరెంటు బిల్లుతో సంబంధం ఏమిటని, తాము అధికారంలోకి వస్తే అలాంటి నిబంధనలేవీ ఉండవని చెప్పారు. ఇప్పుడు అంతకు మించి నిబంధనలు పెట్టి అనేక మందికి నిధులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు.


