బాబు సర్కారు తీరుకు నిరసనగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శన | Relay hunger strikes enter 16th day | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు తీరుకు నిరసనగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శన

Jul 17 2026 4:37 AM | Updated on Jul 17 2026 4:37 AM

Relay hunger strikes enter 16th day

16వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు 

మంగళగిరి రూరల్‌: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్‌) వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్‌ సభ్యులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని చినకాకాని గ్రామం ఎన్నారై జంక్షన్‌ నేతన్న సర్కిల్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. గత 16  రోజుల నుంచి నిరాటంకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను సర్కారు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. తమ బాధలు వినే సమయం బాబు ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.780 కోట్ల  సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై  డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను ఈనెల 7న కలిశామని, సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఫలితం లేదని పేర్కొన్నారు. 

కాగా, అర్ధనగ్న  ప్రదర్శన చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి పారిశ్రామికవేతలను అడ్డుకున్నారు.  పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని హెచ్చరించారు. దీంతో పారిశ్రామికవేత్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రామ్మూర్తి నాయక్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బానోతు రమేష్, సంఘం అనంతపురం కో–ఆరి్డనేటర్‌ ఆదినారాయణ, కడప కో–ఆర్డినేటర్‌ ఆర్‌.ఎన్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement