సమర్డోంగ్: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ సిక్కిం జిల్లాలోని సమర్డోంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎన్హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా కొండచరియలు విరిగిపడి సొరంగం దెబ్బతిన్నది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 27 మంది వరకు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే బాధితులను రంగపో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అయితే, సొరంగంలోకి విషపూరిత వాయువులు వ్యాపించడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పేలుడు ధాటికి సొరంగం ఒక భాగం పూర్తిగా ధ్వంసమై దారి మూసుకుపోయింది. నామ్చి జిల్లా కలెక్టర్ అనూపా తామ్లింగ్ మాట్లాడుతూ, సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షణ పరికరాలు లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రమాదకర పరిస్థితుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం!


