సాక్షి పాఠకులకు శుభోదయం!. ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్‌పై అమెరికా దాడులు పదో రోజుకు చేరాయి. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, నిరసనల వేడి కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఏపీలో గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినో ఆందోళనలతో లోటు వర్షపాతంతో నైరుతి ప్రభావం తగ్గిందనుకున్న తరుణంలో.. అనూహ్యంగా దేశం మొత్తం దట్టంగా మేఘాలు అలుముకోవడం, వర్షాలు కురుస్తుండడం ఉన్న రైతులకు ఇది ఊరట ఇచ్చే వార్త అనే చెప్పొచ్చు.
ఇరాన్ వార్ కంటిన్యూ
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా పదో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకునే లక్ష్యంతో ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మృతి చెందడంతో ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా తెలిపింది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్‌కు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.
హార్ముజ్ జలసంధిపై ఆందోళన.. పెరుగుతున్న చమురు ధరలు
ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా దాదాపు నిలిచిపోయింది. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో కలకలం రేగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 88 డాలర్లకు(అప్డేట్ అందాల్సి ఉంది) పైగా చేరింది. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర మార్గంలో సౌదీ అరేబియా చమురు రవాణాను అడ్డుకుంటామని ప్రకటించడం కొత్త ఆందోళనకు కారణమైంది.
ఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ ఉద్రిక్తత
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకోగా.. ఢిల్లీలో నిరసనల వేడి కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన ‘చలో సంసద్’ పిలుపుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సోమవారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మంగళవారం కూడా పార్లమెంట్ వైపు మార్చ్ కొనసాగిస్తామని CJP నేతలు ప్రకటించారు. ఇటు నిరససకారుల దాడుల్లో 118 సిబ్బందికి గాయాలు అయ్యాయని, 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
పార్లమెంట్లో విపక్షాల నిరసనలు
నిన్న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే వేడెక్కాయి. నీట్ లీకేజీ, అయోధ్య రామమందిర విరాళాల అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈరోజు కూడా ఈ అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎలాగైనా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో యూపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం, అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కోరుతుండగా.. గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉండాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలు
గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్లపై ఫోకస్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు ప్రపంచ మార్కెట్ల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
ఈరోజు ఫోకస్లో..
ఇరాన్‌పై అమెరికా దాడులు.. పదో రోజుకు చేరిన యుద్ధం
హార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ నిరసనలు
పార్లమెంట్లో నీట్, అయోధ్య అంశాలపై రగడ
రాహుల్-అఖిలేశ్ భేటీ.. యూపీ పొత్తులపై చర్చ
గుంటూరు ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
మార్కెట్లు, వాతావరణ అప్డేట్స్


