సాక్షి మార్నింగ్‌ రౌండప్‌: జులై 22.. నేటి బిగ్‌ హెడ్‌లైన్స్‌ ఇవే! | Sakshi Morning Roundup July 22nd 2026, Todays Top Stories, Breaking News And Main Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Sakshi Morning News Roundup: జులై 22.. నేటి బిగ్‌ హెడ్‌లైన్స్‌ ఇవే!

Jul 22 2026 6:46 AM | Updated on Jul 22 2026 8:58 AM

Sakshi morning roundup july 22nd todays top stories Main Headlines

సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు ఉధృతం కాగా.. ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు నిరసన నాటకీయ పరిణామాలకు దారి తీసింది. దీనికి నిరసనగా కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు 11వ రోజుకు చేరడంతో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ‘చలో లోక్‌భవన్‌’ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ పొగాకు రైతులతో భేటీ కానున్నారు..

ప్రధాని నివాసం వద్ద యుద్ధ వాతావరణం నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్‌’ మార్చ్‌పై పోలీసుల చర్యకు నిరసనగా.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపు నిరసన చేపట్టారు.

ప్రతిపక్ష నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీకి స్వల్ప గాయాలు అయ్యాయని, ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నేడు కూడా విపక్షాలు తమ నిరసనలు కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ CJP నేతృత్వంలో మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ ధర్నాలు రాహుల్‌ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. ‘చలో లోక్‌భవన్‌’కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని కీలక నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

నీట్‌పై సమగ్ర చర్చకు సిద్ధం: ధర్మేంద్ర ప్రధాన్‌ నీట్‌ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు కావాల్సింది సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం అని పేర్కొన్నారు. ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన ప్రజాస్వామ్య పద్ధతి కాదని.. భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి.

ఇరాన్‌పై అమెరికా దాడులు 11వ రోజుకు.. మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా 11వ రోజు వైమానిక దాడులు జరిపింది. ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్‌ సైట్లు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. మరోవైపు హార్ముజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. జోర్డాన్‌, బహ్రెయిన్‌, కువైట్‌లపై దాడులు జరగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

చమురు ధరలపై యుద్ధ ప్రభావం ఇరాన్‌-అమెరికా ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్‌ జలసంధిలో రవాణా అంతరాయం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

పాలా మున్సిపాలిటీలో రాజకీయ షాక్‌ దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దియా బిను పులిక్కకండం పదవి కోల్పోయారు. కేరళలోని పాలా మున్సిపాలిటీలో ఎల్‌డీఎఫ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో యూడీఎఫ్‌ పాలన ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.

సూరత్‌లో ఏఐ సైబర్‌ మోసాల ముఠా గుట్టురట్టు గుజరాత్‌ సూరత్‌ పోలీసులు ఏఐ ఆధారంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. 18 ఏళ్ల చదువు మానేసిన యువకుడు ఈ నెట్‌వర్క్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక..  దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్రల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగా ఉండనుంది.

పొగాకు రైతులతో వైఎస్‌ జగన్‌ భేటీ.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కూటమి పాలనలో అవస్థలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలతో జగన్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సమ్మె.. తెలంగాణలో గిగ్‌ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. 12 గంటల పాటు సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, ఓలా, ఉబెర్‌ తదితర సేవలు నిలిచిపోనున్నాయి. మినిమమ్‌ చార్జిని ప్రభుత్వం నిర్ణయించాలని.. తమ డిమాండ్లను పరిశీలించాలని అసోషియేషన్‌ కోరుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

సిక్కిం విషాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. సిక్కింలో టన్నెల్‌ కూలిన ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ కేసులో ట్విస్ట్‌.. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌లకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. కేసును షీ టీంకు అప్పగించారు. డీసీపీ లావణ్య నాయక్‌ జాదో పర్యవేక్షణలో విచారణ కొనసాగనుంది. మరోవైపు ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్‌, లైంగిక వేధింపుల నిందితుడు ఉదయ్‌ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈరోజు ఫోకస్‌లో..

* ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన
* రాహుల్‌ గాంధీకి గాయాల ఆరోపణలు
* నీట్‌ లీకేజీపై పార్లమెంట్‌లో రగడ
* ఇరాన్‌పై అమెరికా 11వ రోజు దాడులు
* హార్ముజ్‌ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు
* తెలంగాణ కాంగ్రెస్‌ నిరసనలు
* వైఎస్‌ జగన్‌ పొగాకు రైతులతో భేటీ
* గిగ్‌ వర్కర్ల సమ్మె
* సిక్కిం టన్నెల్‌ ప్రమాదం
* హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ కేసు అప్‌డేట్‌లు  మరిన్ని బ్రేకింగ్‌ అప్‌డేట్స్‌, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్‌తోనే ఉండండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement