నేడు మళ్లీ ‘చలో సంసద్‌’!.. సీజేపీ ఆందోళనతో ఉత్కంఠ | CJP Chalo Sansad March Continue After Delhi Clashes, Police on High Alert | Sakshi
Sakshi News home page

నేడు మళ్లీ ‘చలో సంసద్‌’!.. సీజేపీ ఆందోళనతో ఉత్కంఠ

Jul 21 2026 7:37 AM | Updated on Jul 21 2026 8:51 AM

CJP Chalo Sansad March Continue After Delhi Clashes, Police on High Alert

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వైపు చేపట్టిన ‘చలో సంసద్‌’ మార్చ్‌ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. మరోసారి పరిస్థితులు అదుపుతప్పకుండా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సోమవారం రాత్రి జంతర్‌ మంతర్‌ వద్ద మాట్లాడుతూ.. మంగళవారం కూడా పార్లమెంట్‌ మార్చ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మేం ఈ నిరసన ప్రదేశాన్ని వదిలిపెట్టం.. మళ్లీ పార్లమెంట్‌ వైపు కదులుతాం’’ అని ఆయన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.

సోమవారం హైటెన్షన్‌.. టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజున CJP ఇచ్చిన ‘సంసద్‌ చలో’ పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

అయితే భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, లాఠీచార్జ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు.

పోలీసుల కీలక ప్రకటన
నిరసనల్లో 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల దాడుల్లో 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో కొంతకాలం పాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. రాత్రి వరకు కూడా అక్కడ భారీగా పోలీసులు, ఆందోళనకారులు మోహరించారు.

చర్చలకు ప్రభుత్వం ప్రయత్నం
ఘర్షణల మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు మార్గం సుగమం చేసింది. కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో రెండుసార్లు సమావేశమైనట్లు సమాచారం. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందించాలని మంత్రి సూచించగా.. అనంతరం మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించినట్లు తెలుస్తోంది.

మంగళవారం మళ్లీ మార్చ్‌.. పోలీసుల వ్యూహం
మంగళవారం మరోసారి పార్లమెంట్‌ వైపు మార్చ్‌ చేపడతామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. పార్లమెంట్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన వేళ.. విపక్షాల నిరసనలు, సీజేపీ ఆందోళనలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం ‘చలో సంసద్‌’ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement