ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు | YSRCP MP Maddila Gurumoorthy moves adjournment motion on deteriorating law and order in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

Jul 21 2026 5:07 AM | Updated on Jul 21 2026 5:07 AM

YSRCP MP Maddila Gurumoorthy moves adjournment motion on deteriorating law and order in AP

పోలీసులు అధికార దుర్వీనియోగానికి పాల్పడుతున్నారు  

పౌరహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు 

రాష్ట్రంలో శాంతిభద్రతలపై లోక్‌సభలో చర్చించాలి  

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి వాయిదా తీర్మానం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోక్‌సభలో తక్షణం సమగ్రచర్చ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పోలీసులు అధికార దుర్వీనియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు, ఎస్సీలపై దాడులు, రాజకీయహింస, పౌర­హ­క్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని ఆ తీర్మానంలో తెలిపారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా దీనిపై సభలో అత్యవసరచర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలను గురుమూర్తి వాయిదా తీర్మానంలో ప్రస్తావించారు.  

కస్టడీలోనే చంపేస్తున్నారు  
విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌ డెత్, నెల్లూరు జిల్లా మనుబోలులో పోలీస్‌ కస్టడీలో దళిత యువకుడు ఏడుకొండలు మృతి, కర్నూలు జిల్లా అదోనిలో మాల గంగమ్మ, విజయవాడలో క్రాంతికుమార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్‌కే దరియా హుస్సేన్‌ మరణాలు వంటివి రాష్ట్రంలో పోలీసువ్యవస్థ పనితీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. వారంతా కస్టడీలోనే చనిపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంటే 2024 జూన్‌ నుంచి 2025 మార్చి వరకు మహిళలపై నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను కూడా ఆయన తీర్మానంలో పొందుపరిచారు. ఈ కాలంలో మొత్తం 319 ఘటనలు నమోదయ్యాయని, అందులో 126 అత్యాచారాలు, లైంగికదాడులు, 12 అత్యాచారయత్నాలు, 35 లైంగిక వేధింపులు, 97 భౌతికదాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు ఉన్నాయని, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యాయత్నాల కేసులు ఉన్నాయని వివరించారు.  

ఎస్సీలపై 69 ఘటనలు 
అలాగే ఎస్సీలపై జరిగిన 69 ఘటనలను కూడా గురుమూర్తి ప్రస్తావించారు. హత్యలు, కస్టడీ హింస, పోలీసుల వేధింపులు, సామా­జిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు ఇందులో ఉన్నా­యన్నారు. రాజకీయ హింసకు సంబంధించి  133 ఘటనలు నమోదయ్యాయని, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయ­త్నాలు, 6 కిడ్నాప్‌లు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంస ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపిస్తున్న నాలుగు ఆత్మహత్యలు ఉన్నాయని వివరించారు.

రాష్ట్ర పోలీసుల పనితీరుపై హైకోర్టు 12 సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని, శాంతిభద్రతలకు సంబంధించి 79 ప్రధాన ఘటనలు జరిగిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతోపాటు పౌరుల రాజ్యాంగబద్ధ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశంపై లోక్‌సభలో సమగ్రచర్చ నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరాలని, నమోదైన అన్ని ఘటనలపై కాలపరిమితితో కూడిన నిష్పక్షపాత విచారణ జరిపించాలని, ఎక్కడ ఉల్లంఘనలు నిర్ధారణ అయితే అక్కడ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుమూర్తి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement